
ఇసుక తక్కువ ధరకు ఇచ్చేలా చూడండి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌లో ఇసుకను తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని మినరల్ డెవలప్‌మెంట్ చైర్మన్ అనిల్‌కుమార్‌కు మాజీమంత్రి జీవన్‌రెడ్డి వినతిపత్రం అందించారు. వినియోగదారులకు రూ.6500కు ట్రిప్ ఇసుక ఇస్తుండడం భారంగా మారిందన్నారు. అక్రమ రవాణా ద్వారా వచ్చే ఇసుక సాండ్ బజార్ ఇసుక కన్నా తక్కువని, దీంతో నెలలో రూ.8 లక్షలు మాత్రమే రెవెన్యూ వచ్చిందని తెలిపారు. చైర్మన్ చొరవ చూపి రేట్లు తగ్గించాలని కోరారు.
పెన్షనర్ల బకాయిలు వచ్చేవరకు ఉద్యమం
జగిత్యాల: ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు వచ్చేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి జీపీఎఫ్, జీఐఎస్, లీవ్స్, కమ్యుటేషన్, గ్రాట్యూటీ అందలేదన్నారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, నరేందర్‌రావు, వెంకటరమణ, అహ్మద్, ప్రభు, కరుణశ్రీ, రాందాస్, వేణుగోపాల్, విమల, చంద్రమౌళి పాల్గొన్నారు.
ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారిగా అశోక్
జగిత్యాల: ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారిగా అశోక్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి హైదరాబాద్ అర్బన్ ఏడీగా వెళ్లారు. ఆయన స్థానంలో నిజామాబాద్‌లో ఏడీగా పనిచేస్తున్న అశోక్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.