
జగిత్యాల బల్దియాపై ‘విజిలెన్స్’
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అవినీతి మయంగా మారింది. ప్రతిపనికి ఓ రేటు నిర్ణయిస్తున్న బల్దియా సిబ్బంది అందినకాడికీ దోచుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలో కొందరు సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారులు ఆగస్టులో సుమారు 18 మంది విజిలెన్స్ అధికారుల బృందం జగిత్యాలకు చేరుకుని బల్దియాలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల రికార్డులను తీసుకెళ్లారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. అవి నీతిలో ప్రమేయముందని భావించి.. కొన్నివిభాగా ల సిబ్బందికి రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కా ర్యాలయంలో హాజరుకావాలని సోమవారం మె మో జారీ చేసినట్లు సమాచారం. వారంతా మంగళవారం విచారణకు హాజరైనట్లు తెల్సింది. ఆయా విభాగాల ఉద్యోగులను విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు మరిన్ని రికార్డులు తీసుకురావాలని చె బుతూ కరీంనగర్‌లోని కార్యాలయానికి రమ్మన్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు పుడుతోంది.
అన్ని విభాగాల్లోనూ అంతే..
బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడం కొత్తేమీకాదు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పర్మిషన్లు, శానిటేషన్ విభాగంలో ట్రేడ్‌లైసెన్స్‌లు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్‌లో వాటర్ చార్జీలు, టెండర్లకు సంబంధించి, రెవెన్యూ విభాగంలో అసెస్మెంట్ కాపీలు, ముటేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వచ్చినా సిబ్బందిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వీటిని భరించలేని కొందరు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతంలోనే విచారణ చేపట్టారు. నాటి ఫిర్యాదులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే నిర్మించిన ప్రతి భవనాలను పరిశీలించారు. ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. గతంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకరు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినంతగా.. ఆర్వో విభాగంలో ఓ భూకబ్జా యత్నంలో ఏకంగా మున్సిపల్ కమిషనరే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా విజిలెన్స్ అధికారులు అవినీతి ఆరోపణలకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలిస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది.
నామమాత్రపు చర్యలు
బల్దియాలో అధికారులపై నేరుగా ఆరోపణలు వస్తున్నా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నట్లు అపవాదు ఉంది. ఇటీవల ఓ బిల్‌కలెక్టర్ ఏకంగా ఆస్తిపన్ను డబ్బులను సొంతానికి వాడుకోగా సస్పెండ్ చేశారు. అలాగే కొన్ని కీలక శాఖల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జగిత్యాల బల్దియాపై ‘విజిలెన్స్’