
‘గాలికుంటు’ నివారణకు స్పెషల్ డ్రైవ్
మెట్‌పల్లిరూరల్: పశువుల్లో సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించకుంటే పశువులు.. వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాలికుంటు నివారణ టీకాలు వేస్తోంది. ఎప్పటిలాగే ఈ సారి బుధవారం నుంచి నవంబర్ 14వరకు పశువైద్య, సంవర్థక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయనున్నారు. దూడలు, ఆవులు, గేదేలకు టీకాలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
జిల్లావ్యాప్తంగా టీకాలు
జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు, 31 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 45 ఉప పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,17,734 పశువులు ఉన్నాయి. వీటన్నింటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేలా జిల్లా పశువైద్య, సంవర్థక శాఖ సిద్ధమైంది. నిర్ణయించిన తేదీల్లో ఆయా గ్రామాలకు వెళ్లి టీకాలు, టీకా వేసిన పశువులకు ట్యాగ్ వేయనున్నారు.
వ్యాధి లక్షణాలు
గాలికుంటు అంటూ వ్యాధి. ఇది మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వ్యాపిస్తుంది. దేశవాళి పశువులతో పోల్చితే సంకరజాతి పశువుల్లో అధికం. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వచ్చి నీరసించిపోతాయి. నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. పొక్కులు పుండ్లుగా మారతాయి. నొప్పితో పశువులు మేత, నీరు తీసుకోవు. నోటి నుంచి చొంగ కారుతుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ చర్యలతోనే రక్షణ
గాలికుంటు వ్యాధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని పశువైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. పశువులను వేరుగా ఉంచాలి. ఆర్నెళ్లకోసారి తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దూడలు, ఆవులు, గేదెలకు ఈ టీకాలు వేయించి వ్యాధుల నుంచి రక్షించుకోవాలి. ఉచితంగానే వేస్తున్న టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– కొమ్మెర మనీషాపటేల్, మెట్‌పల్లి
పశువైద్యాధికారి