
జిల్లాలో ‘జువైనల్ జస్టిస్’
జగిత్యాలజోన్: ఇటీవల బాలనేరాలు పెరిగిపోతున్నాయి. నేరాలకు పాల్పడిన చిన్నారులపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. కోర్టులు వారిని జువైనల్ హోంకు తరలించి విచారణ చేపడుతున్నాయి. వారి జీవితం చీకటిమయం కాకుండా.. సమాజంలో ఉన్నతులుగా ఎదిగేందుకు అవసరమైన సహాయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డులు అందిస్తున్నాయి. బాల నేరస్తుల్లో సత్ప్రవర్తన తెచ్చేలా.. కేసులు సకాలంలో విచారించేలా పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015 ప్రకారం ప్రతి జిల్లాలో జువైనల్ జస్టిస్ బోర్డులు (జువైనల్ కోర్టులు) ఏర్పాటు అవుతున్నాయి. జిల్లా కేంద్రానికి జువైనల్ జస్టిస్ బోర్డు మంజూరు కాగా.. బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి ప్రారంభించనున్నారు.
జువైనల్ జస్టిస్ బోర్డులోనే విచారణ
18 ఏళ్ల లోపు ఉండి.. నేరాలకు పాల్పడిన బాల నే రస్థుల కేసులను జువైనల్ జస్టిస్ బోర్డు(కోర్టు)లో నే విచారిస్తాయి. ఈ కోర్టును జిల్లా కేంద్రంలోనే ప్ర త్యేక భవనంలో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుకు చైర్‌పర్సన్‌గా జిల్లా మొదటి అదనపు జ్యూడిషి యల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సామాజిక సేవకురాలు శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్ ఉంటారు. వారంలో ఒక్కటి రెండు రోజులు మేజిస్ట్రేట్ నేరుగా జువైనల్ జస్టిస్ బోర్డుకు వెళ్లి, బాల నేరస్తుల కేసులను విచారిస్తారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న బాల నేరస్థులకు అదే భవనంలో వసతి కల్పిస్తారు.
ఇప్పటివరకు కరీంనగర్‌లో..
ఇప్పటివరకు జువైనల్ కోర్టు కరీంనగర్‌లో ఉంది. తాజాగా జగిత్యాలలోని బైపాస్‌రోడ్డులో ప్రత్యేక భవనంలో ఏర్పాటుచేశారు. కోర్టు ఏర్పాటుతో 166 కేసులు కరీంనగర్ నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాయి. ఇంకా వందవరకు కేసులు రానున్నాయి. జువైనల్ జస్టిస్ బోర్డులు బాల నేరస్తుల్లో సత్ప్రవర్తను తెచ్చేందుకు పెద్దపీట వేస్తాయి. బాల నేరస్తులు ఒకేచోట ఉండడం ద్వారా వారు మంచి నడవడికతో ఉండేందుకు.. పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు, విద్యా, వైద్య సౌకర్యాలు అందించేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొదించేందుకు బోర్డులు ప్రయత్నిస్తాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి శిక్ష వేస్తే వారికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చూపిస్తారు.