● ప్రమాదాన్ని గమనించి ఆగిన ఎస్పీ
● తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదవశాత్తు గాయపడ్డ వ్యక్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే తన పైలట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. సోమవారం బైపాస్‌రోడ్డుపై వెళ్తున్న ఎస్పీకి ప్రమాదంలో గాయపడ్డ అశోక్‌నగర్‌కు చెందిన రఫీక్‌పాషా కనిపించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను తన వాహనంలో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలింపజేశారు.
భవనం పైనుంచి తోయడంతో ఒకరు మృతి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులోని బ్రీడింగ్ అండ్ హెచరీస్ ప్రైవేటు కంపెనీలో పేయింటింగ్ పనిచేస్తున్న దాసో సోరెన్ (32)ను తోటి పేయింటర్ భవనం పైనుంచి తోయడంతో కిందపడి చనిపోయాడు. చిగురుమామిడి ఇన్‌చార్జి ఎస్సై స్వాతి వివరాల ప్రకారం.. సోరేన్‌ను 15 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి కాంట్రాక్టర్ ఎస్‌కే.అర్షద్ పేయింటింగ్ వేసేందుకు తీసుకొచ్చాడు. ఇతనితో పాటు ముస్లింఖాన్ కూడా వచ్చాడు. ఆదివారం రాత్రి ఇరువురు డబ్బుల విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ముస్లింఖాన్ సోరెన్‌ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన సోరెన్‌ను 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అర్షద్ ఫిర్యాదుతో తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్ సోమవారం శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేశారు.