
ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
మెట్‌పల్లి: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందన్నారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచకపోవడం, ఆడపిల్ల వివాహానికి తులం బంగారం అందజేయకపోవడం, పూర్తి స్థాయిలో రూ.2లక్షల రుణమాఫీన అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు అందించి గౌరవిస్తే.. కాంగ్రెస్ ఆ ప్రక్రియను నిలిపివేసి కించపరిచిందన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.