
పట్టణం.. కళావిహీనం
జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ మున్సిపల్ అధికారులు చెబుతుంటారు. వారరే పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాకేంద్రమైన జగిత్యాల సుందరీకరణ పేరుతో గతంలో సుమారు రూ.10 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. కొత్తబస్టాండ్ పాతబస్టాండ్ వద్ద జంక్షన్లు నిర్మించి అందులో పక్షుల బొమ్మలు, రాతి కట్టడాలు, ఫౌంటేన్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వాటి నిర్వహణ మర్చిపోవడంతో ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. ఫౌంటేన్ ఒక్కసారి కూడా పనిచేయడంలేదు. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే అడపదడపా వచ్చి ఫౌంటేన్ ప్రారంభించి వదిలేస్తుంటారు. అందులో ఉన్న పచ్చిగడ్డి ఎండిపోయింది. బొమ్మలు దుమ్ము, దూళితో కళాహీనంగా మారాయి.
ఏపుగా పెరుగుతున్న కానోకార్పస్ చెట్లు
జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు, డివైడర్ల మధ్యనున్న చెట్లను తొలగిస్తుండాలి. వాటిని పట్టించుకోకపోవడంతో కానోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగాయి. కొత్తబస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారితోపాటు, కరీంనగర్ వెళ్లే రహదారిలో కుడి, ఎడమ రహదారుల వైపు వెళ్లేవారు మచ్చుకై నా కన్పించరు. పైగా అందులో అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్‌కు వెళ్లే దారిలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చెట్లు ఏర్పాటుచేశారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక ఎండిపోయే దుస్థితి నెలకొంది. మధ్యలో పిచ్చిమొక్కలు పెరిగాయి. పచ్చదనం పెంచుతూ.. అందంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఎటుచూసినా కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
పట్టింపేది..?
అసలే జిల్లా కేంద్రం. నిత్యం వివిధ పనులపై జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఈ మధ్యనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేశారు. జంక్షన్లుగానీ, డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన మొక్కలపై నిర్వహణ చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగాయి. వాటి మధ్య పిచ్చిమొక్కలూ పెరిగిపోయాయి.
ఎన్విరాన్‌మెంట్ అధికారులెక్కడ?
హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను అందంగా తీర్చిదిద్దడంతోపాటు, వాటిని రక్షించేందుకు ఎన్విరాన్‌మెంట్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కానీ వారు మచ్చుకు కన్పించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటించడంతోపాటు, పిచ్చిమొక్కలను తొలగిస్తూ.. ఎప్పుడూ మొక్కలకు నీరు పోస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సుందరీకరణపై శ్రద్ధ పెట్టి ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించడంతోపాటు, ఫౌంటేన్లను పునఃప్రారంభించాలని పట్టణప్రజలు కోరుతున్నారు.

పట్టణం.. కళావిహీనం

పట్టణం.. కళావిహీనం

పట్టణం.. కళావిహీనం