
వ్యక్తి పేరుతో ఊరు.. వంశమంతా ఒకటే తీరు
వెల్గటూర్: అది ఎండపల్లి మండలంలో రాజారాంపల్లి. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి ఒకటే కారణం.. గ్రామానికి చెందిన ఏలేటి రాజారాంపటేల్ ఆ ఊరుకు చేసిన సేవ. ఆయన పేరునే గ్రామానికి పెట్టుకున్నారు. పాఠశాల, పంచాయతీ కార్యాలయం, దేవాలయాలు, సమ్మక్క, సారలమ్మ జాతర స్థలం, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, వాటర్ ట్యాంకులు, అంగన్‌వాడీ కేంద్రం, మహిళాసంఘం భవనం ఇలా అన్నీ ఏలేటి వంశీయుల జ్ఞాపకాలే. ఓ పదివేలు దానం చేసి వంద మందితో సన్మానాలు చేయించుకునే ఈ రోజుల్లో గ్రామ అభివృద్ధికి కోట్ల విలువైన స్థలాలు గ్రామానికి అప్పగించారు ఏలేటి వంశీయులు. తాజాగా మండలకేంద్రానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు ఏలేటి వంశస్థులను కోరగా.. సుమారు రూ.ఐదుకోట్ల విలువైన భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏలేటి రాజారాంపటేల్ విగ్రహానికి గ్రామస్తులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన ఏలేటి వంశస్థులు సత్యనారాయణ రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, విజయ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.