
రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు
జగిత్యాల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తొలి విడతలో 10 మండలాలు, రెండో విడతలో 10 మండలాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వెబ్‌కాస్టింగ్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత బలగాలు ఉండేలా చూడాలన్నారు. సోషల్ మీడియాను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్‌పేపర్లు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బంది ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి అన్ని వసతులున్నాయో లేదో చూసుకోవాలన్నారు. మండలకేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్కృటిని, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. అధికారులకు పాటించాల్సిన నిబంధనలు, విధులపై అవగాహన ఉండాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నోడల్ అధికారిని నియమించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మధన్‌మోహన్ పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ పాటించాలి
ఎన్నికల కోడ్ పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు లోబడి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బందులుంటే కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 96662 34383 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.