
బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం
జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్‌కాంబ్) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు. వీటిని పెద్దాపూర్, తెలుకుంట, నాగులపల్లె, జూలపల్లి, చీమలపేట తదితర గ్రామాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. మూడు నెలలకే పంట కోతకు వస్తుంది. పెట్టుబడి తక్కువ, శ్రమతో కూడుకున్నది. అయినా, డిమాండ్ అధికంగా ఉండడంతో అన్నదాతలు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మ పండుగకు మూడు నెల ముందే నారుపోస్తారు. సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన పూలు పండిస్తున్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలకే పరిమితమైన పట్టుకుచ్చుల సాగు.. ఇప్పుడు సుమారు 15 ఎకరాలకు పైగా పెరిగిందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామని రైతులు చెబుతున్నారు.
పల్లెల నుంచి పట్టణాలకు..
వివిధ పల్లెల్లో పండిస్తున్న పట్టుకుచ్చుల పూలను రైతులు పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, గోదావరిఖని, కరీనంగర్, హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
పెద్దాపూర్‌లో పెరిగిన సాగు విస్తీర్ణం
రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని వినతి