
సెల్‌ఫోన్ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: బీటెక్ చదువు మధ్యలో మానేసి ఇంటి వద్ధ ఖాళీగా ఉంటూ.. సెల్‌ఫోన్ చూస్తుండటంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ఈగ రాహుల్ (25) బీటెక్ మధ్యలో మానేశాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఎక్కువగా సెల్‌ఫోన్ చూస్తున్నాడు. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన రాహుల్ ఇంట్లో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు.
కరెంట్ బిల్లు చెల్లించమన్నందుకు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
ధర్మపురి: విద్యుత్ బిల్లు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన బండారి లక్ష్మణ్ జీవనోపాధి కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు సర్వీస్‌సెంటర్ పెట్టుకున్నాడు. కరెంట్ బిల్లులో సగం నాలుగు రోజుల క్రితం చెల్లించాడు. మిగిలిన మొత్తం చెల్లించాలని విద్యుత్ సిబ్బంది బుధవారం ఇంటివద్దకు వెళ్లి గొడవ చేశారు. దీనికి మనస్తాపానికి గురైన లక్ష్మణ్ ఇంటిపక్కనున్న విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లను పట్టుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో కరెంట్ పోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు, స్నేహితుల చొరవతో కిందికి దిగి విద్యుత్ సిబ్బందితో మాట్లాడించారు.
పెద్దపల్లిరూరల్: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాం ఆవరణలో బుధవారం లారీ ఢీకొన్న ఘటనలో అఫ్జల్‌బేగం (58) అనే కార్మికురాలు అక్కడికక్కడే మరణించింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నివాసముంటున్న అఫ్జల్‌బేగం.. ఎప్పటిలాగే గోదాంలో పనికి వెళ్లింది. పనిచేస్తున్న సమయంలో కార్మికురాలిని చూడకుండా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా వెనక్కి తీసుకురావడంతో ఢీ కొందని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. మృతురాలి కూతురు పర్‌వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

సెల్‌ఫోన్ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య