
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● గతానికి భిన్నంగా వెసులుబాటు
● అక్టోబర్ 20 గడువు
కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ సర్వేశ్రీ క్రమంగా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కొంత ఆలస్యంగా మొదలవగా సర్వే పురోగతిని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమీక్షిస్తున్నారు. వచ్చే అక్టోబరు 20నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గతేడాది సర్వే నిర్వహణకు ఏఈవోలు చేతులెత్తేయగా ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
17 అంశాలతో వివరాల నమోదు
మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలు, దిగుమతులు, ఎగుమతులు, ప్రాసెసింగ్ వంటి అవసరాల ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. 17 పేజీల మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశించింది. పచ్చిరొట్ట, అపరాలు, సీడ్ ప్రొడక్షన్ వివరాలు, అంతర పంట వివరాలు, సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు, ప్రతి పంట వాటి రకాలు, నీటి వసతి, ఉద్యాన పంటలైతే వయసు, చెట్ల సంఖ్య నమోదు చేయనున్నారు. గత నెల వరకు 2,10,234 పాసుపుస్తకాలకు డిజిటల్ సైన్ కాగా ప్రతి సర్వే నంబర్ వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అనంతరం రైతుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్ రానుంది.
పురుషులకు 2 వేలు.. మహిళలకు 18,00 లక్ష్యం
సీజన్లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న క్షేత్రాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుష ఏఈఓలు కనీసం 2వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటికి సాధారణ క్రాప్ బుకింగ్ పద్ధతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్లోడ్ చేయటం తప్పనిసరి. నమోదు మొత్తాన్ని ఒకే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది.
సర్వే ఎందుకంటే
దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా సులువు. అలాగే దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణ ఉంటుంది. అలాగే చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు సంసిద్ధతకు వినియోగించనున్నారు. వ్యవసాయ పురోగతి అంచనాకు ఈ సర్వే దోహదపడుతుంది.
రైతుకు సంక్షిప్త సందేశం
క్రాప్ బుకింగ్ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈవో మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరంగా సాగుతోందని, తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.
జిల్లాలో మొత్తం రైతులు : 2,10,234
మొత్తం క్లస్టర్లు : 77
రెవెన్యూ గ్రామాలు : 205
భూ విస్తీర్ణం : 3,33,450 ఎకరాలు