
‘విండో’ పదవీకాలం పొడిగింపులో రాజకీయం
జగిత్యాలఅగ్రికల్చర్: సింగిల్ విండో సొసైటీలపై రాజకీయం అలుముకుంది. పాలకవర్గం ఐదేళ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. సకాలంలో ఎన్నికలు నిర్వహించక.. ఆర్నెళ్లచొప్పున పొడిగించడం వివాదాలకు దారి తీస్తోంది. ఇటీవల రెండోసారి పొడిగించిన ప్రభుత్వం.. కొన్ని పాలకవర్గాలను తిరిగి కొనసాగించగా.. మరికొన్నిటిని రద్దు చేసింది. వారి స్థానంలో సహకార అధికారులను పర్సన్ ఇన్‌చార్జిగా నియమించింది. బీఆర్‌ఎస్ పార్టీ పాలకవర్గం ఉన్నచోట మాత్రమే తొలగించి.. అధికార పార్టీ పాలకవర్గాలను పొడిగించారంటూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, రద్దయిన పాలకవర్గాల చైర్మన్లు కలెక్టర్ సత్యప్రసాద్‌కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ముగిసిన 51 సొసైటీల పదవీకాలం
జిల్లాలో 51 సింగిల్ విండో సొసైటీలు ఉన్నాయి. వీటి పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఆ సమయంలో అన్ని సొసైటీల పాలకవర్గాలను ఆగస్టు 14 వరకు పొడిగించింది. అప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో మరోసారి ఆర్నెళ్లు పొడిగించింది. ఈ సమయంలోనే సొసైటీలను రాజకీయం చుట్టుముట్టింది. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా లేని సొసైటీ పాలకవర్గాలను మాత్రమే తొలగించి పర్సన్ ఇన్‌చార్జిలను నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి ఆరోపణల సాకుతో రద్దు..
అన్ని సొసైటీల్లో ఏదోరకమైన అవినీతి ఆరోపణలు ఉంటాయి. కానీ.. కాంగ్రెస్ నాయకులు ఉన్న పాలకవర్గాలపై అవినీతి ఆరోపణలు లేవని, సంఘం అ భివృద్ధి దిశలో ఉందని, ఆ సంఘాల పదవీకాలన్ని పొడిగించారని, సంఘాలు అభివృద్ధి దిశలో ఉన్నప్పటికీ.. చైర్మన్లు, డైరెక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారనే నెపంతోనే ఆ సంఘాల పదవీకాలాన్ని పొడిగించలేదని రద్దయిన చైర్మన్లు అంటున్నారు. సహకార శాఖ అధికారులు లేని కారణాలు చూపుతూ పాలకవర్గాలు రద్దయిన సొసైటీలకు నోటీసులు పంపడం వివాదానికి దారితీస్తోంది.
రద్దుకు అధికారులు చూపించిన కారణాలివే..
కొన్ని సొసైటీల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించకుండా సహకార శాఖ అధికారులు చూపించి న కారణాలు చూస్తే విస్తుపోవాల్సిందే. సొసైటీల్లో సభ్యులు తీసుకున్న రుణాలను పాలకవర్గాలు రికవ రీ చేయించలేదని, వారి పేర్లు ప్రకటించలేదని, రికవరీ యాక్షన్ అమలు చేయలేదని, సొసైటీ ఫైనాన్సి యల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదని, ఆడిట్ రిపోర్టులో తప్పులు చూపించినా సరిదిద్దుకోలేదని, ఏడాది ఆదాయం, వ్యయం రిపోర్టులు సమర్పించలేదని, కుటుంబసభ్యులకు రుణాలు ఇప్పించారని, ధా న్యం కొనుగోలులో గన్నీసంచుల వ్యవహారంలో ని ర్లక్ష్యం ప్రదర్శించారని, ఎప్పటికప్పుడు సొసైటీ కరెంట్ అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయలేదని.. ఇలా చిన్నచిన్న కారణాలతోనే పదవీకాలాలను రద్దు చేసి పర్సన్‌ఇన్‌చార్జిలను నియమించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఈ తతంగం నడిపిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
ఒత్తిడితో నాలుగు సొసైటీలకు మినహాయింపు
జిల్లాలోని 23 సొసైటీల పాలవర్గాలను తొలగించి రెండురోజుల క్రితం పర్సన్ ఇన్‌చార్జిలను నియమించారు. ప్రకటన వెలువడిన వెంటనే తనకు తెలియకుండా ఎలా చేశారు..? పర్సన్ ఇన్‌చార్జిలను నిలిపివేయండి.. అంటూ అధికారులకు అధికార పార్టీ నాయకుడొకరు గట్టిగా చెప్పడంతోనే జగిత్యాల, కల్లెడ, భూపతిపూర్, ఇటిక్యాల సొసైటీలకు మినహాయింపు వచ్చినట్లు సమాచారం. మల్లాపూర్ మండలంలో నాలుగు సొసైటీలు ఉండగా.. ఒక సొసైటీ చైర్మన్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన సొసైటీని వదిలి.. మిగిలిన పాలకవర్గాలను రద్దు చేసినట్లు వినికిడి.