
ధర్మపురిలో కదం తొక్కిన అంగన్‌వాడీలు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ అంగన్‌వాడీ టీచర్ల స మస్యలు పరిష్కరించడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు రజిత అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదటు సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అంగన్‌వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. మండుటెండలో సుమారు రెండు గంటలపాటు కూర్చోని నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తక్కువ వేతనాలతో ఎక్కువ పని భారం మోస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం చిన్నచూపెందుకని ప్ర శ్నించారు. అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటియు జిల్లా కో–కన్వీనర్‌లు, ఇందూరి సులోచన, చంద్రశేఖర్ తదితరులున్నారు.