
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి
జగిత్యాలటౌన్: ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ తెరిపించాలని, ప్రభుత్వంతో మాట్లాడి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు కోరారు. చక్కెర రైతుల సమస్యలపై బీజేపీ నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ మూసివేతతో రెండు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారికి నెలకు రూ.5వేల జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మెట్‌పల్లి మండలం ఆత్మకూరు వాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ రద్దు చేసి భూగర్భజలాలను కాపాడాలని కోరారు. యావర్‌రోడ్డు విస్తరణపై ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇరుకురోడ్డుతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. యావర్‌రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాకేంద్రంలో క్రీడామైదానం, క్రీడా పరికరాలు అందుబాటులో లేవన్నారు. జిల్లా కేంద్రంలో 50ఎకరాల్లో క్రీడామైదానం ఏర్పాటు చేసి వసతులు కల్పించాలన్నారు. నూకపెల్లి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు ఇళ్లు కేటాయించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పదాధికారులు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు, పట్టణ అధ్యక్షులు ఉన్నారు.