
కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై దుష్ప్రచారం
మెట్‌పల్లిరూరల్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట శివారులోని రివర్స్ పంప్‌హౌజ్‌ను సోమవారం బీఆర్‌ఎస్ శ్రేణులు సందర్శించారు. వరదకాల్వ బ్రిడ్జిపై ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణకు జీవనధారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. ప్రాజెక్ట్‌లు కట్టి పంట పొలాలకు నీళ్లు ఇవ్వడమే నేరమా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి, సంక్షేమం పడకేసిందన్నారు. ఇప్పటివరకు ఆ పార్టీ చేసిందేమీలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాల బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.