
ఈ–పాస్ యంత్రాలకు కొత్త స్కానర్లు
● రేషన్ షాపుల్లో సులువుగా బియ్యం పంపిణీ
కథలాపూర్: రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీలో అవాంతరాలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పంపిణీకి ఉపయోగించే ఈ–పాస్ యంత్రాల్లో స్కానర్ల మార్పిడికి సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు రేషన్ డీలర్లు వినియోగిస్తున్న ఈ పాస్ యంత్రాలకు కొత్త స్కానర్లను అమర్చే ప్రక్రియ చేపడుతున్నారు.
520 రేషన్ షాపులు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 385 గ్రామాలున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఉంటున్నవారికి 520 రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా రేషన్‌షాపుల నుంచి బియ్యం పంపిణీ చేస్తుండగా.. యంత్రాలు మొరాయించడం, టెక్నికల్ సమస్యలతో కొన్ని సందర్భాల్లో గంటలతరబడి లబ్ధిదారులు దుకాణాల్లో నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు ఈ–పాస్ యంత్రాల్లో స్కానర్లను మార్చాలని నిర్ణయించారు. జూన్‌లో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో ఆగస్టు వరకు రేషన్ దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ఉండదు. ఈ వ్యవధిలో స్కానర్లను మార్చి కొత్త వాటిని అమరిస్తే పంపిణీకి మరింత సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ మండలకేంద్రానికి టెక్నీషియన్లను ఉన్నతాధికారులు పంపించి ఆయా గ్రామాల్లోని రేషన్‌డీలర్లు మండలకేంద్రాలకు యంత్రాలతో వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలఖారులోగా ఈ పాస్ యంత్రాల్లో కొత్త స్కానర్లు అమర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లయ్ అధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు.
తరచూ మొరాయిస్తుండటంతో కొత్త స్కానర్లు..
రేషన్ డీలర్లకు సుమారు ఐదేళ్ల కిందట మంజూరు చేసిన ఈ–పాస్ యంత్రాలకు స్కానర్ల సమస్య తలెత్తిన విషయాన్ని సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ చేసే సమయంలో వేలిముద్ర త్వరగా స్వీకరించకపోవడం, రెండు మూడు సార్లు వేలిముద్ర పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పంపిణీలో జాప్యం జరుగుతోంది. స్కానర్ సక్రమంగా పనిచేయకపోవడంతో బ్లూటూత్ సమస్యలు తలెత్తాయి. ఏకంగా ఈ పాస్ యంత్రాల్లోని స్కానర్లను మార్చితే సమస్యలుండవని అధికారులు, టెక్నీషియన్లు భావించారు. ఈ పరిస్థితుల్లో మార్పు చేసిన యంత్రాలు త్వరగా వేలిముద్రలు స్వీకరిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే యంత్రాల్లో డిస్‌ప్లే, కీ ప్యాడ్ పనిచేయకపోవడం, బ్యాటరీ సమస్యలు కొన్ని రేషన్‌షాపుల్లో తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. స్కానర్లతోపాటు ఇతర పరికరాలు మార్చాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
నెట్ లేకున్నా మిషన్ పనిచేయాలి
ప్రభుత్వం రేషన్ షాపులకు అందించిన ఈ–పాస్ యంత్రాలు నెట్ సౌకర్యం ఉంటేనే పనిచేస్తాయి. ఇప్పటికి కొన్ని గ్రామాలకు సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేదు. ఆ గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలంటే డీలర్లకు ఇబ్బందిగా ఉంది. నెట్ లేకున్నా రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందించడానికి యంత్రాలు పనిచేసేలా కొత్త టెక్నాలజీ పరికరాలు రేషన్ డీలర్లకు అందించాలి. – సింగారపు చిన్నయ్య,
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర నాయకులు.

ఈ–పాస్ యంత్రాలకు కొత్త స్కానర్లు