
ప్రజావాణికి 41 దరఖాస్తులు
● జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 41మంది అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయడం లేదు
జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివారులోని సర్వేనంబర్ 817/1లోగల మా సొంత భూమికి ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించడానికి దరఖాస్తు చేసుకున్నాం. చల్‌గల్ కార్యదర్శి మోఖాపైకి వచ్చి సర్వే నిర్వహించి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో పెండింగ్ చూపిస్తోందని రుసుం తీసుకోవడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించి భూమిని క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోండి.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
మాది పెద్దపల్లి జిల్లా తిప్పన్నపేట గ్రామం. మా చెల్లులి కుటుంబం జగిత్యాలలో నివాసం ఉంటోంది. అదే ఇంటి డాబాపై అద్దెకు ఉండే దుబ్బాక తిరుపతి జగిత్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. కలెక్టర్‌తో కలిసి ఉన్న ఫొటోలను చూపాడు. మా కుమారుడికి పెద్దపల్లి కలెక్టరేట్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.30లక్షలు తీసుకున్నాడు. దుబ్బ గట్టయ్యకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 80వేలు తీసుకున్నాడు. ఇప్పుడు స్పందించడం లేదు. మోసపోయామని జగిత్యాల కలెక్టరేట్‌లో వాకబు చేయగా.. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉద్యోగం చేయడం లేదని తెలిసింది. ఉద్యోగం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని మాకు న్యాయం చేయండి.
అక్రమ పట్టాతో నీడ లేకుండా చేశాడు
బర్దీపూర్ గ్రామ పరిధిలోని 5.13 ఎకరాల ప్రభుత్వ భూమిని డి–1 దొంగ పట్టాతో రమేశ్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్నడు. బర్లు, గొర్లకు నిలువ నీడ లేకుండా అయ్యింది. మా గ్రామ బర్లు, గొర్లు మేపుకునే సర్వే నంబర్ 376/2లోని 5.13 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇదే మండలంలోని కేశాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ 2018లో ఎల్‌ఆర్‌యూపీ ద్వారా అక్రమంగా పట్టా పొందాడు. అడిగితే మాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నడు.
పంచాయతీ లెక్కలు తేల్చండి
బుగ్గారం పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై లెక్కలు తేల్చాలని, నిందితులపై చర్యలు చేప ట్టే వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక చేయొ ద్దు. పంచాయతీలో రూ.కోటికి పైగా నిధుల దుర్వినియోగం అయ్యింది. ప్రత్యేక చొరవ చూపి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోండి.

ప్రజావాణికి 41 దరఖాస్తులు

ప్రజావాణికి 41 దరఖాస్తులు

ప్రజావాణికి 41 దరఖాస్తులు

ప్రజావాణికి 41 దరఖాస్తులు