
● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నె
మెట్‌పల్లి: విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి ఉన్నతాధికారులు అలాంటి వారిని ప్రోత్సహించాలి. కానీ.. కొంతకాలానికే బదిలీ వేటు వేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. మెట్‌పల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరి అధికారుల బదిలీ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు మామూళ్లకు దూరంగా ఉంటూ.. అక్రమదందాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఏడాది లోపే వారికి బదిలీని బహుమతిగా ఇచ్చి పంపించారు.
సమర్థవంతమైన విధులు నిర్వర్తించినా..
● గతేడాది జూన్‌లో మెట్‌పల్లి సీఐగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న సమయంలో ఆయన మామూళ్లకు దూరంగా ఉన్నారు.
● అక్రమ దందాలపై కాస్త కఠినంగానే వ్యవహరించారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు వంటి వాటిపై నిఘా పెట్టి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించారు.
● ఆయన సర్వీసులో అప్పటివరకు చూపిన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక చేసింది.
● వీటన్నింటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నపళంగా బదిలీ చేశారు.
ఇసుక దందాపై కన్నెర్రనే కారణమా..?
● మెట్‌పల్లి మండలంలో రీచ్ లేకపోవడంతో ఇసుక దందా అంతా అక్రమంగానే సాగుతోంది.
● ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశాలివ్వడంతో తహసీల్దార్ శ్రీనివాస్ ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు.
● కేసులు నమోదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున డంప్‌లను స్వాధీనం చేసుకొని వేలం వేశారు.
● తహసీల్దార్ తీరుతో అక్రమ దందాకు అవరోధాలు ఏర్పడడంతో సోమవారం అకస్మాత్తుగా కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
ఫలించిన రాజకీయ ఒత్తిళ్లు..
● ఈ ఇద్దరి అధికారులను బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం ఉంది.
● అధికారులు నిజాయితీగా వ్యవహరించడం కొందరి నాయకులకు ఇబ్బందిగా మారడంతో తమ పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయించారనే చర్చ నడుస్తోంది.
● పోస్టింగ్, బదిలీలకు రాజకీయ నేతల సిఫార్సులు తప్పనిసరిగా మారడంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి.