
పల్లెల్లో స్థానిక సందడి
● జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు ● పెరిగిన రెండు ఎంపీపీ, రెండు జెడ్పీటీసీ స్థానాలు ● 1,123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
జగిత్యాలరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేయడంతో గ్రామాల్లో ఎన్ని కల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు, పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా గురువారం విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. 2024 జనవరి 31న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
జిల్లాలో 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలు
జిల్లాలో గతంలో 18 జెడ్పీటీసీ, 18ఎంపీపీ స్థానాలు ఉండేవి. కొత్తగా భీమారం, ఎండపల్లి మండలాలు ఏర్పాటు కావడంతో రెండు స్థానాలు పెరిగాయి. తాజాగా 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ, 216 ఎంపీటీసీ స్థానాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పునర్విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గతంలో జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానా లు ఉండగా.. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్ గ్రామంలో ఎంపీటీసీ 2వ స్థానం ఏర్పడింది. ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో మరో ఎంపీటీసీ స్థానాన్ని నూతనంగా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం 216కు చేరింది.
మొదలైన ఎన్నికల వేడి
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నాయకుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగనున్నాయి. జెడ్పీటీసీలు అందరు కలిసి జెడ్పీచైర్మన్‌ను ఎన్నుకోనుండగా.. ఎంపీటీసీలందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఎన్నికల కోలాహలం గ్రామాల్లో మొదలైంది. 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్‌ను పంపించింది. గవర్నర్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల హెడ్యూల్ విడుదల చేయనున్నారు. రిజర్వేషన్ల విషయం ఆందోళనకు గురిచేస్తున్నా.. స్పష్టత వచ్చాక ఎలా వ్యవహరించాలనే దానిపైనా అంచనాలు రూపొందించుకుంటున్నారు.
మొత్తం గ్రామపంచాయతీలు 385
మొత్తం ఓటర్లు 6,02,236
మొత్తం ఎంపీటీసీ స్థానాలు 216
జెడ్పీటీసీ స్థానాలు 20
ఎంపీపీ స్థానాలు 20
ఎన్నికలకు సిద్ధం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో గతంలో కంటే రెండు జెడ్పీటీసీ, రెండు ఎంపీపీ, రెండు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 1123 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కోసం సిద్ధం చేశాం.
గౌతంరెడ్డి, జెడ్పీ సీఈవో

పల్లెల్లో స్థానిక సందడి