
బల్దియా గాడిన పడేనా..?
● ప్రక్షాళనకు అధికారుల శ్రీకారం ● వివిధ విభాగాల సిబ్బంది మార్పు ● అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం ● తీరు మారాలంటున్న మున్సిపాలిటీ ప్రజలు
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందిని ఇతర శాఖలకు మార్చుతూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిశాఖలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది అవినీతికి తెరలేపుతున్నట్లు ఆరోపణలు రావడం.. కొన్ని విభాగాల్లో అవినీతి యథేచ్ఛగా జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. ము న్సిపాలిటీని గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా సమావేశమై మున్సిపాలిటీలో ప్రతీదీ సక్రమంగా నిర్వహించేలా చూడాలని, ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏయే విభాగాల్లో ఏళ్ల తరబడి సిబ్బంది పాతుకుపోయారో గుర్తించి వారిని ఇతర సెక్షన్లకు బదిలీ చేస్తున్నారు.
మున్సిపాలిటీలో అతి ముఖ్యమైన విభాగం రెవెన్యూ. ఈ విభాగంలోనే అత్యధికంగా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఓ భూమికి సంబంధించిన కేసులో ఇక్కడ గతంలో పనిచేసిన కమిషనర్, ఆర్వో భూ వివాదంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని టీపీవో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీకీ చిక్కాడు. ఆయనతోపాటు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పట్టుబడ్డాడు. మరోవైపు శానిటేషన్ విభాగంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాలకు పంపించారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న అధికారులను ఇంజినీరింగ్ సెక్షన్‌కు మార్పు చేశారు. ఇంజినీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న కొంత మందిని టౌన్‌ప్లానింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఇలా ప్రతీశాఖలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రక్షాళన చేస్తున్నారు.
పాతుకుపోయిన సిబ్బంది
మున్సిపాలిటీలో కొందరు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో ఏళ్ల తరబడి పనిచేయడంతో అందులో లొసుగులు తెలుసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రజలు ఏ విషయంపైన దరఖాస్తు చేసుకుంటే దళారుల మధ్యనే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పారిశుధ్య విభాగానికి వెళ్లాల్సిన పీహెచ్ వర్కర్లు కూడా ఆఫీసులోనే తిష్ట వేసినట్లు ఆరోపణలున్నాయి.
ప్రత్యేక దృష్టి
మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో శానిటేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆఫీసుల్లో పనిచేస్తున్న పీహెచ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి పంపించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది.
కీలకశాఖల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు
కొన్ని కీలక శాఖల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే మున్సిపాలిటీకి సుమారు 69 మంది వార్డు ఆఫీసర్లు రావడంతో వారికి సైతం బాధ్యతలు అప్పగించినప్పటికీ మరిన్ని విభాగాల్లో సైతం కొనసాగుతున్నట్లు సమాచారం. వీరు పారిశుధ్య ప్రణాళిక అమలు, వ్యర్థాలను వేరు చేయించడం, మురికికాలువలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లు, మటన్, చికెన్ స్టాండ్లు, కబేళాలు చక్కగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నియంత్రణ, హరితహారం, వీధిదీపాల పర్యవేక్షణ, నీటి సరఫరా పర్యవేక్షణ చాలా బాధ్యతలున్నాయి. వీటిని చేయడంతో పాటు, వార్డుల్లో మరిన్ని పనులను వారికి అప్పగిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది మార్పుతోనైనా పాలన గాడిన పడేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

బల్దియా గాడిన పడేనా..?