బ్యాంక్‌ ఖాతాలపై నజర్‌! | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఖాతాలపై నజర్‌!

Jul 18 2025 5:24 AM | Updated on Jul 18 2025 5:24 AM

బ్యాంక్‌ ఖాతాలపై నజర్‌!

బ్యాంక్‌ ఖాతాలపై నజర్‌!

● మెటా సూత్రధారులు, నిర్వాహకుల అకౌంట్లపై ఆరా ● చొప్పదండిలో ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీ వసూళ్లు ● ఇంకా ఫిర్యాదుకు వెనకాడుతున్న బాధితులు ● రాజకీయంగా ఒత్తిడి తెస్తున్న నలుగురు సీఐలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

మెటా క్రిప్టో కరెన్సీ పేరిట జరిగిన కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. మెటా ఫండ్‌ పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు జనాల నుంచి వసూలు చేసిన ఉదంతంలో సూత్రధారులు, నిందితులు, అనుమానితులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెంచాయి. మెటా ఫండ్‌లో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన సూత్రధారి లోకేశ్‌ దేశం దాటి థాయ్‌లాండ్‌ వెళ్లిన ఘటనలో అతన్ని కరీంనగర్‌కు పరిచయం చేసిన మాజీ కార్పొరేటర్‌, ప్రకాశ్‌ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు, రమేశ్‌, రాజు వివరాలను నిఘాసంస్థలు సేకరించాయి. వీరిలో కొందరిపై క్రిమినల్‌ హిస్టరీ, చెక్‌బౌన్స్‌ కేసులు ఉన్నట్లు గుర్తించాయి. వీరి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. మెటా ఫండ్‌ ప్రారంభానికి ముందు.. తరువాత వీరి బ్యాంకులో లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్‌కు సన్నిహితంగా ఉండే బీజేపీ బడా నేత బ్యాంక్‌ ఖాతాలపైనా కేంద్రం సంస్థలు నిఘా పెట్టాయి. అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నాయి.

చొప్పదండిలో ఎన్‌ఆర్‌ఐల విలవిల

చొప్పదండి నియోజకవర్గంలో పలువురు చోటా బడా లీడర్లు క్రిప్టో వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. అందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి చాలా తెలివిగా.. కేవలం ఎన్‌ఆర్‌ఐలనే లక్ష్యంగా చేసుకున్నాడు. మూడు నెలల్లో భారీ లాభాలు ఉంటాయని నమ్మబలికి రూ.కోట్లు వసూలు చేశాడు. తీరా ఇప్పుడు మెటాఫండ్‌ మూతబడటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. వారంతా ఇండియాకు రాలేరు, ఇక్కడికి వచ్చి కేసులు గట్రా అంటే పాస్‌పోర్టు, వీసాలకు ఇబ్బందిగా మారుతుందని అతన్ని నిగ్గదీయాల్సింది పోయి.. బ్రతిమాలుకుంటుండటం విశేషం. ఈ బలహీనతతోనే నిర్వాహకులు రూ.కోట్లు కొల్లగొట్టినా దర్జాగా తిరగగలుగుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో లాఅండ్‌ఆర్డర్‌లో పనిచేస్తున్న నలుగురు సీఐలు తమ బినామీలతో భారీగా డబ్బులు పెట్టారు. వారంతా ఇప్పుడు లోకేశ్‌ అతని మిత్రగణంపై రాజకీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్తపల్లి పీఎస్‌, టూటౌన్‌, రూరల్‌ పరిధిలో పిటిషన్లు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో లోకేశ్‌ రూ.100 కోట్లతో థాయ్‌లాండ్‌ పారిపోయాడని బాధితులు వాపోతున్నారు. అప్పుడే స్పందించి ఉంటే లోకేశ్‌ దేశం దాటకుండా ఉండేవాడని వాపోతున్నారు. ఆయా ఠాణాల్లో ఫిర్యాదులు చేసిన పిటిషనర్లను ఇప్పటికై నా విచారిస్తే.. పెద్ద కుంభకోణం వెలికి తీసిన వారవుతారని సీనియర్‌ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గోవాలో బెదిరింపులు

వాస్తవానికి మెటా ఫండ్‌ నిర్వాహకుడిగా చెబుతున్న లోకేశ్‌ గతేడాది మాజీ కార్పొరేటర్‌తోపాటు రమేశ్‌, రాజు, ప్రకాశ్‌లను గోవా తీసుకెళ్లాడు. వీరందరినీ అక్కడ లోకేశ్‌ పదుల సంఖ్యలో బౌన్సర్లతో ప్రైవేటు గెస్ట్‌ హౌజ్‌లోకి తరలించాడు. అక్కడ వీరంతా మెటా కార్యకలాపాలు నిలిచిపోయాయి, లాభాలు రావడం లేదు, డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు వేధిస్తున్నారని లోకేశ్‌ను నిలదీశారు. దానికి లోకేశ్‌ తీవ్రంగా స్పందించి.. నష్టాలకు మనమంతా బాధ్యులమేనని బాండ్‌ పేపర్లపై సంతకాలు పెడితే.. డబ్బులు ఇస్తానని బెదిరించే యత్నం చేశాడు. ఊరు కాని ఊరిలో పార్టీ అంటే వెళ్లిన వీరంతా అక్కడ లోకేశ్‌ బెదిరింపులకు దిగడంతో హతాశయులయ్యారు. తమను చంపినా తాము సంతకాలు పెట్టమని, పెడితే లీగల్‌గా ఇరుక్కున్న వారిమవుతామని అతనితో వాదించి ఎలాగోలా అక్కడ నుంచి బయటపడి కరీంనగర్‌కు చేరుకున్నారు. తీరా కరీంనగర్‌కు వచ్చాక.. తమకున్న పరిచయాలతో కేసులు కాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అదే సమయంలో బలహీనులను బెదిరింపులకు గురిచేస్తూ.. బలవంతులకు మాత్రం బాండ్‌ పేపర్లు, చెక్కులు రాసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement