
జంక్షన్ నాలాలను శుభ్రం చేయాలి
● అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలి ● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని, జంక్షన్ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డులను గురువారం పరిశీలించారు. మురికినీరు సక్రమంగా వెళ్తోందా లేదా గమనించారు. అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో అక్రమ కట్టడాలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని మేజర్ జంక్షన్ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ధరూర్ కెనాల్ వద్ద రోడ్డు ప్రమోషన్ అయిన దానిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చింతకుంట చెరువు నీరు బయటకు వెళ్లేందుకు నాలాలను క్లీనింగ్ చేయడంతో పాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యర్థ నివారణ, డ్రెయినేజీలు, వాగులు ప్రభుత్వ భూములను శుభ్ర పర్చాలన్నారు. రామాలయం పక్కనున్న ప్రభుత్వ భూములైన పెద్దనాలా, ఎస్సారెస్పీ కాలువపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు భూముల యజమానులు తమ భూముల్లోని ముళ్ల చెట్ల పొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ మొత్తం డబ్బుతో శుభ్రత చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు కన్పించేలా కార్యచరణ, పర్యవరణ పరిశుభ్రత చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు.