
మల్చింగ్ సాగు బాగు
● కూలీల కొరతకు చెక్ ● షీట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
జగిత్యాలఅగ్రికల్చర్: వర్షాలతో పంట చేలల్లో కలుపు మొక్కలు పెరిగి రైతులకు ఇబ్బందిగా తయారవుతాయి. కూలీలు దొరకకపోవడంతో.. పంటను మించి కలుపు మొక్కలు పెరిగి తీవ్ర నష్టం చేస్తున్నాయి. కొంతమంది రైతులు కలుపుతీయించినా లాభం లేదంటూ పంటనే వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్నారు రైతులు.
జిల్లాలో 1.50లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు
జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న 43 వేల ఎకరాలు, పసుపు 35వేలు, కంది 5వేలు, పెసర మూడు వేలు, పత్తి 20వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటి నివారణకు గడ్డిమందులు పిచికారీ చేసినా వర్షాల కారణంగా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో తుంగ, గరకవంటి కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి. ఈ లోపే నాట్లు మొదలవడంతో కలుపు తీయాలా.. వద్దా అనే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.
వేధిస్తున్న కూలీల కొరత
పంటల్లో కలుపు తీయించేందుకు రైతులు కూలీల కోసం తిరుగుతున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఇస్తామన్నా.. కలుపుతీతకు రావడం లేదు. మొక్కజొన్న వంటి పంటలకు మొదటి దఫా రసాయన ఎరువులు వేయలేకపోతున్నారు.
మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్న రైతులు
రెండేళ్లుగా వర్షాలు ఉండటం, కలుపు సమస్య పెరగడంతో కొంత మంది అభ్యుదయ రైతులు కలుపు మొక్కల నివారణకు మల్చింగ్ షీట్‌ను ఉపయోగిస్తున్నారు. కూలీలకు పెట్టే ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను కొనుగోలు చేస్తున్నారు. సాగు భూమిని బోజెలుగా తయారు చేసి, వాటిపై మల్చింగ్ షీట్‌ను పరుస్తున్నారు. షీట్‌కు రంధ్రాలు చేసి వాటిలో మొక్కజొన్న, కంది వంటి విత్తనాలు నాటుతున్నారు. ఈ పద్దతిని ఎక్కువగా కూరగాయల సాగుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల సమస్యతో విసిగిపోయిన రైతులు ఖర్చు ఎంతైనప్పటికీ మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు కూడా ఉపయోగిస్తున్నారు.
జిల్లాలో 312 ఎకరాల్లో సబ్సిడీపై మల్చింగ్ షీట్లు
ఎంఐడీహెచ్ పథకం కింద మల్చింగ్ షీట్‌కు ఉద్యానశాఖ రాయితీలు అందిస్తోంది. ఎకరాకు రూ.8వేల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. జిల్లాలో 312 ఎకరాల వరకు అర్హులైన రైతులకు మల్చింగ్ షీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, అధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌లతో ఉద్యానశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారుల క్షేత్ర పరిశీలన చేసి రైతులకు సబ్సిడీ అందించనున్నారు.
రైతులందరికీ మల్చింగ్ షీట్ ఇవ్వాలి
మల్చింగ్ షీట్‌ను అడిగిన ప్రతి రైతుకు ఇవ్వాలి. సాధారణంగా కూరగాయల, పండ్లతోటలతో పాటు ఆరుతడి పంటల్లో కలుపు మొక్కల సమస్య తీవ్రంగా ఉంటుంది. సబ్సిడీపై ఇస్తే చాలా మంది రైతులు ప్రతి పంటకు మల్చింగ్ షీట్ వేస్తారు.
– బండారి వెంకటేష్, పెంబట్ల, సారంగాపూర్
దరఖాస్తు చేసుకోవచ్చు
మల్చింగ్ షీట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 312 ఎకరాల వరకు మల్చింగ్ షీట్‌ను సబ్సిడీపై ఇవ్వనున్నాం. మల్చింగ్ షీట్‌ను జాగ్రత్తగా వాడుకుంటే 3నుంచి4 పంటలకు వస్తుంది. కలుపు మొక్కలకు చెక్ పెట్టవచ్చు.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి

మల్చింగ్ సాగు బాగు

మల్చింగ్ సాగు బాగు

మల్చింగ్ సాగు బాగు