
నాణ్యత డొల్ల.. ఆరోగ్యం డీలా..!
● హోటళ్లలో తాండవిస్తున్న అపరిశుభ్రత ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యజమానులు ● ప్రజారోగ్యాన్ని పట్టించుకోని అధికారులు ● ప్రజలకు నాసిరకం ఆహారం తినిపిస్తున్న నిర్వాహకులు
జగిత్యాల: జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగిన నూనెలోనే మళ్లీమళ్లీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఎప్పుడోసారి మొక్కుబడిగా తనిఖీ చేయడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. గ్లాసులు కడిగిన నీటిలోనే మళ్లీ కడగడం, టిఫిన్ ప్లేట్లను కూడా అదే నీటిలో కడగడం చేస్తున్నారు. కనీసం వంట గదులైనా శుభ్రంగా ఉండడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో చేసిన ఆహార పదార్థాలనే ప్రజలకు అంటగడుతున్నారు.
అసలే వానాకాలం.. ఆపై సీజనల్ వ్యాధులు
జిల్లాలో సుమారు 500 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. వివిధ అవసరాల కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హోటళ్లలోనే తింటుంటారు. అల్పాహారం, భోజనం కోసం టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లను ఆశ్రయిస్తారు. ఈనేపథ్యంలో హోటళ్ల నిర్వాహకులు పాత్రలను ౖపైపెనే శుభ్రం చేస్తూ వినియోగదారులకు ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు, బల్లులు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. వంట చేసే మాస్టర్లు, సర్వర్లు ఆఫ్రాన్స్, క్యాప్‌లు, గ్లౌస్‌లు ధరించాల్సి ఉంటుంది. కానీ, ఇవి మచ్చుకు కూడా కన్పించవు. భోజనం చేసే ప్రాంతంలో మాత్రం ప్రజలను ఆకట్టుకునేలా శుభ్రంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టి హోటళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నాసిరకం ఆహార పదార్థాలు
జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో నకిలీ నూనె, నాసిరకం ఆహార పదార్థాలు వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఒకరోజు వినియోగించిన నూనె మరోరోజు వినియోగించకూడదు. కానీ.. కొన్ని హోటళ్లు కోళ్ల వ్యర్థాలు, జంతువుల కళేబరాలు, ఎముకల నుంచి తయారుచేసిన నూనెలు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. భోజనం తయారుచేసే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు, మాంసం మిగిలితే నిల్వ చేయకూడదు. ఏరోజుకారోజు ఆహార పదార్థాలు వడ్డించాల్సి ఉండగా అసలు ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. అటు మున్సిపల్ అధికారులు, ఇటు ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా మారింది. కొందరు నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.
తనిఖీలు చేస్తాం
హోటళ్లలో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. భోజన ప్రియులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ప్రతీరోజు తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– స్పందన, మున్సిపల్ కమిషనర్

నాణ్యత డొల్ల.. ఆరోగ్యం డీలా..!

నాణ్యత డొల్ల.. ఆరోగ్యం డీలా..!