
స్వచ్ఛతకు పురస్కారం
● జగిత్యాల బల్దియాకు రాష్ట్రస్థాయిలో 51, జాతీయస్థాయిలో 312వ ర్యాంకు
జగిత్యాల: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 గాను జగిత్యాల బల్దియాకు పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయస్థాయిలో 312వ ర్యాంక్ సాధించగా, రాష్ట్రస్థాయిలో 51వ స్థానంలో నిలిచింది. గతేడాదికంటే కొద్దిగా మెరుగుపడింది. కేంద్ర ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా పట్టణాల్లో జనాభా ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తోంది. మున్సిపాలిటీలో 50 వేల నుంచి 3 లక్షల వరకు గల కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా జగిత్యాల సైతం ఉంది. ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాలు వేరు చేయడం, రీసైక్లింగ్, బయోమైనింగ్ తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. 11 వేల మార్కులకు గాను జగిత్యాల 7,684 సాధించింది.