
‘గంగనాల’కు గడ్డుకాలం
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఏటా వానాకాలంలో గోదావరి నుంచి గంగనాల ప్రాజెక్టుకు నీళ్లు చేరి ఆయకట్టు సాగునీరు అందేది. ఈసారి వర్షాలు లేక ప్రాజెక్టుకు గడ్డుకాలం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి శివారులో గోదావరిపై 1959లో గంగనాల ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా మండలంలోని వేములకుర్తి, యామపూర్, ఫకీర్‌కొండాపూర్, మల్లాపూర్ మండలం మొగి లిపేట పెద్ద చెరువులోకి నీళ్లు చేరి అక్కడి నుంచి న డికుడ, సంగెం శ్రీరాంపూర్, దామ్‌రాజ్‌పల్లి గ్రామాల్లోని 2,500 ఎకరాలకు సాగునీరు అందించారు.
వైఎస్సార్ హయాంలో..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు నుంచి మాటుకాలువ వెడల్పు చేసి ఇరువైపులా సిమెంట్ లైనింగ్ చేపట్టి ఆయకట్టు పెంచేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో 20 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పూర్తయి ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కాగా, ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలో కొంత వర్షాలు పడి ప్రాజెక్టుకు నీళ్లు రావడంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు వరినార్లు పోశారు. ప్రస్తుతం వర్షాలు లేక గోదావరి వెలవెలబోవడంతో గంగనాల ప్రాజెక్టుకు చుక్క నీరు రాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరినార్లు ఎండిపోతుండడంతో ఈసారి పంటలు పండుతాయో లేదోనని అన్నదాతలు ఆవేదన చెందుతుతున్నారు. ప్రాజెక్టు కింద వేములకుర్తి శివారులో సుమారు 900 ఎకరాల్లో వరి పండిస్తారు.
ఎస్సారెస్పీ నుంచి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టులోకి నీళ్లు రావడానికి గోదావరిలోకి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే వరినార్లు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వర్షాలు లేక వెలవెలబోతున్న ప్రాజెక్టు
ఆయకట్టు కింద ఎండిపోతున్న నార్లు
సాగుపై ఆందోళన చెందుతున్న రైతులు
ఎస్సారెస్పీ నీరు వదలాలంటూ డిమాండ్