
● నెలకు సుమారు రూ.15 కోట్ల వ్యాపారం ● 10 నుంచి 15 శాతం
జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వాహనాల యజమానులు రిజిస్ట్రేషన్ పత్రాలు తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకుంటున్నారు. సమయానికి డబ్బులు అందక అప్పు చెల్లించడంలో జాప్యమైతే తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ఆ వాహనాలను అద్దెకిస్తూ సంపాదిస్తున్నారు.
ఓపెన్ చెక్కులు.. తెల్లపేపర్ల సంతకాలు
అధిక వడ్డీకి అప్పు ఇస్తున్న వ్యాపారులు తీసుకున్న వారినుంచి ఓపెన్ చెక్కులు, తెల్లపేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. జాప్యం జరిగితే చెక్కులు, పేపర్లు చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. వాహన పేపర్లు కూడా తాకట్టు పెడుతున్న సమయంలో వాహనం మార్పు కోసం రవాణాశాఖకు అవసరమైన 29, 30 ఫారంపై కూడా ముందే సంతకాలు తీసుకుంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నవారు బాకీ చెల్లించకుంటే వడ్డీ వ్యాపారులు ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో అద్దెకిస్తూ నెలనెలా డబ్బులు సంపాదిస్తున్నారు.
– జిల్లాకేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ఓ వ్యక్తి సాధారణ ప్రజలకు వాహనాలు, బంగారం, భూ డాక్యుమెంట్లు తాకట్టు పెట్టుకుని 10 నుంచి15 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు. వడ్డీ తీసుకున్న వ్యక్తుల నుంచి ఓపెన్ చెక్కులు, తెల్లపేపర్లపై, వాహనాన్ని మార్పు చేసుకునేందుకు ఫారం 29, 30 మీద సంతకాలు తీసుకుంటున్నాడు. డబ్బు చెల్లించని వారిని వేధించడంతోపాటు, వారికి తెలియకుండానే వాహనాలను మార్పు చేసుకుంటున్నాడు.
– జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలు, భూమి, కార్లు తాకట్టు పెట్టుకుని సుమారు రూ.2 కోట్ల మేర అప్పు ఇచ్చాడు. రూ.10 నుంచి రూ.15 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాడు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేసినా, వాహనాలు, బంగారం, భూములు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వడం చట్ట విరుద్ధం. అధిక వడ్డీ వసూలు చేసినా.. ఇబ్బందులకు గురిచేసినా.. డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి వాపస్ ఇవ్వకున్నా ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై చర్యలు చేపడతాం.
– రఘుచందర్, జగిత్యాల డీఎస్పీ

● నెలకు సుమారు రూ.15 కోట్ల వ్యాపారం ● 10 నుంచి 15 శాతం