
‘రెసిడెన్షియల్’కు శంకుస్థాపన
గొల్లపల్లి:తాను ఎమ్మెల్యే కాకముందు అద్డె భవనాల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు చూశానని, అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలకు నిధులు మంజూరు చేయించానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఇకనుంచి విద్యార్థుల కష్టాలు తీరినట్లేనని తెలిపారు. మండల కేంద్రంలో రూ.17కోట్లతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పక్కా భవనం తీసుకొచ్చానన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి మగ్గిడిలో ఉన్న స్కూల్‌ను తరలిస్తామని తెలిపారు. యువతకు క్రీడా ప్రాంగణం కోసం 735 సర్వేనంబర్‌లోగల స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరందన్, ఆర్‌ఐ మహిపాల్, పార్టీ మండల అధ్యక్షుడు నిషాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూలీ డబ్బుల పంపిణీ
ధర్మపురి:శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాత్కాలిక లేబర్లకు చెల్లించాల్సిన రూ.4,92,800 విడుదలయ్యాయి. రెండేళ్లుగా లేబర్లకు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడంతో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు విడుదల చేయించారు. ఈ మేరకు గురువారం కమిషనర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. 2023లో జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాలకు మున్సిపల్ ఆధ్వర్యంలో ధర్మపురితోపాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తాత్కాలిక లేబర్లను తీసుకొచ్చి 11రోజుల పాటు పనులు చేయించారు. విప్ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా.. 150 మందికి రూ.4,92,800 మంజూరు చేశారు. వాటిని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ భర్త జక్కు రవీందర్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు.