
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
జగిత్యాలరూరల్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఈ సాలియా నాయక్ సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు సొంతంగా విద్యుత్‌కు సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితిల్లో చేయొద్దన్నారు. తెగిపడిన, వేలాడుతున్న తీగలను తాకకూడదన్నారు. ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ వైర్లకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ దండెంలు ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇంటి ముందు రేకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసా రం కాకుండా చూడాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలకు తగలకుండా పశువులు కాపరులు జాగ్రత్త వహించాలని కోరారు. సెల్‌ఫోన్ ఛా ర్జింగ్ పెట్టి తడి చేతులతో తాకొద్దన్నారు. ఒకవేళ ఎవరైనా షాక్‌కు గురైతే కర్ర, ప్లాస్టిక్ వంటి వస్తువులతో దూరం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, కాలిన తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ సరిచేయొద్దని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య తలెత్తితే ఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించాలని ఆయన కోరారు.
ఎస్‌కేఎన్‌ఆర్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ
జగిత్యాల: భూభారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడత 156 మందికి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. మలి విడతలో 120 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 26 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 276 దరఖాస్తులు వచ్చాయి.