
ప్రశాంతంగా గ్రామ పరిపాలనాధికారి పరీక్ష
జగిత్యాలటౌన్: గ్రామ పరిపాలన అధికారి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 149 మంది అభ్యర్థులకు 142 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, ఏడుగురు గైర్హాజరయ్యారని వివరించారు.
అంజన్న ముడుపుల ఆదాయం రూ.85,094
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు సమర్పించిన ముడుపుల్లో కొంతభాగాన్ని ఈఓ శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో ఆదివారం విప్పారు. రూ.85,094 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి ఎం.రాజమౌళి, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, శ్రీవల్లి సేవా సమతి సభ్యులు పాల్గొన్నారు.
రాఘవపేటలో అత్యధిక వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా 25.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మల్యాల మండలం మద్దుట్లలో 24 మి.మీ, బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 21.3, మల్యాలలో 17, జగిత్యాలలో 16.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
గ్రామ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు
జగిత్యాలక్రైం: చెరువులో చేపలు పట్టేందుకు డబ్బులు చెల్లించాలని గ్రామ పెద్ద మనుషులు ఇబ్బంది పెడుతున్నారని రాయికల్ మండలం అలూరుకు ముదిరాజ్ కులస్తులు ఆదివారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలోని కొత్త చెరువులో చాలా ఏళ్ల నుంచి చేపలు పట్టుకుంటున్నామని, రెండేళ్ల నుంచి ఏడాదికోసారి గ్రామానికి డబ్బులు కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల పేరు మీద చెరువు రిజిస్ట్రేషన్ చేస్తామని గ్రామ పెద్దలు గతేడాది రూ.80 వేలు తీసుకున్నారని, ఈసారి కూడా డబ్బులు ఇవ్వాలని కోరడంతో రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పినట్లు వివరించారు. దీంతో, గ్రామానికి చెందిన కొంతమంది తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రశాంతంగా గ్రామ పరిపాలనాధికారి పరీక్ష