
హడలెత్తిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూనే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనను పరుగులు పెట్టించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, కార్పొరేషన్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శిస్తూ, స్థానిక సిబ్బంది సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా వారేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. విధులకు డుమ్మాకొట్టిన వారు, అలసత్వం వహించేవారు, అవినీతికి పాల్పడే అధికారులను సుమారు ఆరుగురిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలతో గాడినపెట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి విజయకు ప్రతి నెలా పరీక్షలు చేయిస్తూ, డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలను ప్రజలందరూ ఉచితంగా వినియోగించుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. వృద్ధాప్య దశలో ఉన్న ఓ తండ్రిని పట్టించుకోని కొడుక్కి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. కొడుకు పేరిట తండ్రి చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్‌ను తిరిగి తండ్రి పేరుపైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా తబిత ఆశ్రమంలో మానస అనే అనాథ యువతికి పెళ్లిపెద్దగా వ్యవహరించి, అధికారులను సమన్వయం చేస్తూ అంగరంగా వైభవంగా వివాహం జరిపించడం ద్వారా జిల్లావాసుల మన్ననలు పొందారు.