జగిత్యాలరూరల్: దాడి చేశారని కూలీలు శనివారం గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా వెళ్లేందుకు పయనమయ్యారు. కూలీలు వెళ్లకుండా ఇటుక బట్టీల వ్యాపారులు అడ్డు పడటంతో కొత్తబస్టాండ్‌లో గందరగోళం చోటుచేసుకుంది. వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లోని ఇటుక బట్టీల్లో పనిచేసే ఒడిశా కార్మికులు శుక్రవారం హోలీ వేడుకల్లో పాల్గొనగా మద్యం మత్తులో గొడవలు మొదలయ్యాయి. దీంతో బట్టీల నిర్వాహకుడి వ్యక్తి తమపై దాడిచేశాడని, సుమారు 80 మంది కార్మికులు ఒడిశా వెళ్లేందుకు శనివారం జగిత్యాల కొత్తబస్టాండ్‌కు చేరుకోగా, బట్టీల నిర్వాహకులు బస్సు ఎక్కకుండా అడ్డుపడటంతో సుమారు 2 గంటల పాటు గందరగోళం నెలకొంది. పట్టణ సీఐ వేణుగోపాల్ కార్మికులతో పాటు, బట్టీల నిర్వాహకులతో మాట్లాడారు. ఈక్రమంలో కార్మికులంతా బస్సులో ఇంటిబాటపట్టారు.