‘సూరమ్మ చెరువు’పై నిర్లక్ష్యం ఎందుకు?

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు - Sakshi

● కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆది శ్రీనివాస్‌ ● శిలాఫలకానికి కుడుకులపేరు వేసి నిరసన

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. కథలాపూర్‌ మండలకేంద్రంలోని సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకం చిత్రపటానికి బుధవారం కుడుకులపేరు వేసి నిరసన తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రూ.204 కోట్ల వ్యయంతో సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులు చేపడతామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించి, పనులకు భూమిపూజ చేశారని గుర్తు చేశారు. అయినా, నాలుగేళ్లు గడిచినా తట్టెడు మట్టి తీయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతినెలా 22వ తేదీన నిరసన తెలుపుతున్నా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదని ఆయన దుయ్యబట్టారు. సూరమ్మ ప్రాజెక్టు గురించి ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ప్రజాప్రతినిధులు కూడా నోరు మెదకపోవడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు ప్రాజెక్టు పేరు చెప్పి.. ఓట్లు దండుకుని, అధికారం చేజిక్కించుకుంటున్నారని విమర్శించారు. ఆ తర్వాత విస్మరిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు రైతులు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ అజీమ్‌, నాయకులు పులి హరిప్రసాద్‌, గోపిడి ధనుంజయ్‌రెడ్డి, కల్లెడ గంగాధర్‌, కూన శ్రీనివాస్‌, ఎగ్యారపు శ్రీహరి, పూండ్ర నారాయణరెడ్డి, వెలిచాల సత్యనారాయణ, జవ్వాజి చౌదరి, ఆకుల సంతోష్‌, భారీఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top