
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు పదో రోజుకు చేరుకున్నాయి. ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కీవ్‌లు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికై పాశ్చాత్య దేశాలను ఒప్పించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ వద్ద కవ్వింపు చర్యలకు ప్రయత్నించారని తెలిపారు.
జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలని నాటోను కోరుతూ రష్యాను రెచ్చగొట్టాడని తెలిపారు. ఇది పూర్తిగా రష్యా బలగాలను రెచ్చగొట్టిన చర్యలని తప్పుపట్టారు. ఉక్రెయిన్‌లో నో-ఫ్లై జోన్ అమలు చేయాలన్న వ్లొదిమిర్ జెలెన్‌స్కీ విజ్ఞప్తిని నాటో తిరస్కరించింది.
యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా రష్యా బాంబుల వర్షం కురిపించగా.. అక్కడే ఉన్న ఉక్రెయిన్ బలగాలు సైతం రష్యా సైన్యంపై కవ్వింపు దాడులు చేశాయని అన్నారు.
జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని రష్యా బలగాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే జెలెన్‌స్కీ రష్యాను రెచ్చగొట్టారని అన్నారు. ఉక్రెయిన్‌పై నో- ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలని నాటోను కోరడం రష్యాను కవ్వించే చర్యలేనని మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ తెలిపారు.