కుక్కలకూ ఓ క్రూయిజ్.. వీఐపీ రేంజ్‌‌ లగ్జరీ! | world first dog cruise launching And offering pet owners | Sakshi
Sakshi News home page

కుక్కలకూ ఓ క్రూయిజ్.. వీఐపీ రేంజ్‌‌ లగ్జరీ!

Jul 18 2025 11:32 AM | Updated on Jul 18 2025 1:36 PM

world first dog cruise launching And offering pet owners

ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలలో క్రూయిజ్ టూరిజం ట్రెండింగ్ నడుస్తోంది. విశాఖపట్నం నుంచి మద్రాస్ అండమాన్ తదితర ప్రాంతాలకు కార్డాలియా అనే లగ్జరీ క్రూయిజ్ నౌక తిరుగుతోంది. దీనికోసం ఇప్పటికే పర్యాటకులు సముద్ర ప్రేమికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సకల సౌకర్యాలతో కూడిన స్పా, బార్, లగ్జరీ రెస్టారెంట్లు.. రకరకాల రుచులు.. క్యాసినోలు.. వినోదం.. పబ్.. డ్యాన్సులు వంటి కార్యక్రమాలతో అలరించే ఈ కార్డియాలో టికెట్లు కోసం యమగిరాకీ ఉంది. ఒకరోజు ప్రయాణానికి దాదాపు పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సంపన్నులు తమ కుటుంబాలతో.. స్నేహితుల బృందాలు.. లవర్స్ కూడా ఇందులో వెళ్లడానికి ఆ అనుభూతిని పదిలపరచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఇందులో వింత ఏమీ లేదు.. మనుషులు లగ్జరీ క్రూజ్‌లో వెళ్లడంలో వింత.. విడ్డూరం ఏముంది. అమెరికాలో ఓ నౌకాయన సంస్థ కేవలం శునకాల కోసం ప్రత్యేక ట్రిప్ వేస్తోంది. ఇందులో దాదాపు 250 శునకాలతో పాటు వాటి యజమానులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ క్రూజ్‌లో జాగిలాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు సౌకర్యాలు లగ్జరీ సదుపాయాలు కల్పించారు

శునకాల వైభోగం చూతము రారండి..
నీలి సముద్రంలో పాల నురుగును తలపించే కెరటాలు అలా అలా వింజామరలు ఊపుతుండగా అత్యాధునికమైన క్రూయిజ్ సముద్రంలో వయ్యారంగా కదులుతూ ముందుకు సాగుతుంది. వెచ్చని సూర్యకిరణాలు ఆ క్రూయిజ్ మీద పడి మెరుస్తుండగా  నవంబర్ 2025లో ఫ్లోరిడాలోని పోర్ట్ టాంపా బే నుంచి బయలుదేరే ప్రపంచ తొలి లగ్జరీ డాగ్ క్రూయిజ్ కరేబియన్ సముద్రంలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం పెంపుడు జంతువులకు అనుకూలమైన సముద్రయానం మాత్రమే కాకుండా మీ మిత్రులకు అణువణువూ ఆనందాన్ని నింపే ప్రయాణం అవుతుంది. మార్గరిటావిల్లే అట్ సీ, క్రూయిజ్ టేల్స్, ఎక్స్‌పీడియా క్రూయిజ్ వెస్ట్ ఒర్లాండో కలిసి ఈ 6-రోజుల కరేబియన్ సాహసయాత్రను మీ కుక్క పిల్లల కోసం స్వర్గధామంగా రూపొందించారు. కేవలం 250 అదృష్టవంతులైన కుక్కలు మాత్రమే ఈ యాత్రకు పోయే చాన్స్ దక్కించుకుంటాయి.

ప్రత్యేక ఆకర్షణలు:

  • కుక్కలకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ బట్లర్లు

  • ప్రైవేట్ బాల్కనీ రిలీఫ్ జోన్లు

  • ఆన్‌బోర్డ్ గ్రూమింగ్, జలక్రీడలు.. మసాజ్ సెంటర్లు.. ప్లే స్టేషన్లు

  • ఫ్యాన్సీ డ్రస్ పోటీలు

  • కుక్కల స్పా ట్రీట్మెంట్లు, గేమ్స్, ట్రైనింగ్ ఈవెంట్లు

మరి కుక్కపిల్లలతో వచ్చే యజమానులకు ఏం ఉండవా అంటే ఎందుకు ఉండవు.. చాలా ఉంటాయి. వారికోసం  13 లాంజ్‌లు, 12 రెస్టారెంట్లు.. డైనింగ్ హాళ్లు, మూడు స్విమ్మింగ్ పూల్స్, అలరించే స్పా, క్యాసినో ఇవన్నీ వాటి యజమానులకోసం సిద్ధం చేస్తున్నారు.

ఈ టూరుకు వెళ్ళే కుక్కలకు రూల్స్ ఇవీ..

  • ప్రతి కుక్కకు తప్పనిసరిగా  వ్యాక్సిన్లు వేయించి ఉండాలి

  • వాటి ప్రవర్తన సరిగా ఉందన్న సర్టిఫికెట్ కూడా ఉండాలి

  • ప్రీ-రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైంది

  • సీట్స్ తక్కువ, డిమాండ్ ఎక్కువ.. ముందుగానే బుక్ చేసుకోండి!

  • మీ కుక్కలతోపాటు మీరు క్రూయిజ్‌లో విహరించండి.. సముద్రమంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.

-సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement