Sobhraj: 30 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ మీ పక్క సీట్లో కూర్చుంటే..?

Woman Scared Of Serial Killer Sobhraj In Flight Photo Gone Viral - Sakshi

విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్‌ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్‌ చేసి హతమార్చిన కిరాతకుడు.

ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్‌ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు.

‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్‌ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్‌లో విమాన టికెట్‌ బుక్‌ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు.

భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్‌ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్‌ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్‌ పౌరసత్వం లభించింది.
చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top