వీటిని పేల్చేస్తాం.. అంతా స్మాష్‌: ట్రంప్‌ అల్టిమేటం | "Will Blow Up Kharg Island, Oil Wells If.. Trump's Ultimatum To Iran | Sakshi
Sakshi News home page

వీటిని పేల్చేస్తాం.. అంతా స్మాష్‌: ట్రంప్‌ అల్టిమేటం

Mar 30 2026 8:01 PM | Updated on Mar 30 2026 8:57 PM

"Will Blow Up Kharg Island, Oil Wells If.. Trump's Ultimatum To Iran

వాషింగ్టన్‌: పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారే అవకాశాలు కనపడుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 30) ఇరాన్‌కు మళ్లీ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌, అమెరికా మధ్య ఒప్పందం త్వరగా కుదరకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఖర్గ్ దీవిని పూర్తిగా పేల్చి నాశనం చేస్తామని అన్నారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ ద్వారా ఈ హెచ్చరిక జారీచేశారు. ఇరాన్ వెంటనే హార‍్మూజ్ జలసంధిని తెరవకపోతే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

“ఇరాన్‌లో మా సైనిక చర్యలను ముగించేందుకు సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. మంచి పురోగతి జరిగింది. కానీ, ఏదైనా కారణంతో ఒప్పందం త్వరగా కుదరకపోతే, అలాగే హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ దీవిని పేల్చి పూర్తిగా నాశనం చేస్తాం. ఇప్పటివరకు మేము కావాలనే వీటి జోలికి వెళ్లలేదు” అని చెప్పారు. 

ఇరాన్‌లో గత 47 సంవత్సరాలుగా భయంకర పాలకులు ఉన్న సమయంలో తమ సైనికులు, ఇతరులను ఆ దేశం చంపినందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కాగా, అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలూ జరగలేదని ఇరాన్‌ అంటోంది. అయితే, ఇరాన్ తస్నీమ్ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికకు పాకిస్థాన్‌ ద్వారా ఇరాన్‌ స్పందనను పంపింది.

“అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా అన్యాయమైన డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా దౌత్యంలో మార్పులు ఉంటున్నాయి. మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధం ముగించాలని పశ్చిమాసియాలో వస్తున్న విజ్ఞప్తులకు స్వాగతం, కానీ ప్రారంభించినది ఎవరో గుర్తుంచుకోండి” అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సోమవారం (మార్చి 30న) కూడా కొనసాగాయి. ఇరాన్‌లో పెంటగాన్‌ కొన్ని వారాల పాటు భూతల దాడులు చేయడానికి సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దాదాపు 10,000 మంది సైనికులను పంపే ప్రణాళిక ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గత వారం 3,500 మంది సిబ్బందిని అమెరికా పంపింది. అందులో 2,200 మెరైన్లు ఉన్నారు. ఇంకా వేలాది మంది 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి రాబోతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఖర్గ్ దీవిపై దృష్టి సారించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement