వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాల(H-1B Visa) అంశంలో వైట్‌హౌస్ సంచలన ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Karoline Leavitt) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
హెచ్-1బీ వీసాల(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్ల వ్యవహారమై తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్ స్పందించారు. ఈ సందర్భంగా లివిట్ మాట్లాడుతూ..‘అమెరికాలో చాలాకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయి. అమెరికన్ల వేతనాలను హెచ్-1బీ వీసాలు తగ్గించేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి.
అయితే, ట్రంప్ నిర్ణయంపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు అవకాశాలు అందడంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రాధాన్యం. దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. వీసా ఫీజుపెంపుపై కోర్టుల్లో వచ్చిన పిటిషన్లను ఎదుర్కొంటాం’ అని కామెంట్స్ చేశారు.
#WATCH | Washington, DC | On H-1B visas, White House Press Secretary Karoline Leavitt says, "The administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and to strengthen our visa system. For far too long, the… pic.twitter.com/9WLktOOaqd
— ANI (@ANI) October 23, 2025
హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది.
ఫీజు రాయితీలు..
ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.
ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తో సహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందని గ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.


