టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్‌కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్‌ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది.
ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది.
ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది.
కింగ్స్ కాలేజ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ ఆర్థిక శాస్త్రాన్ని మార్చడంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. తక్కువ బడ్జెట్‌లో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.
ఆరాష్-ఎ-కమాంగిర్ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఆయుధమేమీ కాకపోవచ్చని.. కానీ మొబైల్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక రక్షణను విస్తృతం చేయడంలో ఇరాన్ సాధించిన మరో అడుగు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లు రేడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి. వాటిని గుర్తించడం చాలా సులువు. కానీ వీటికి భిన్నంగా. ఈ చిన్న, చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించవచ్చు.. దాచవచ్చు.. వేగంగా ప్రయోగించవచ్చు. సులభంగా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ వ్యవస్థకు పర్షియన్ పురాణాల వీరుడి పేరు పెట్టారు. జానపద కథల ప్రకారం.. ఆరాష్-ఎ-కమాంగిర్ అనే ఓ యోధుడు పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్‌పై పడకుండా ఆయన పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్-మధ్య ఆసియా మధ్య సరిహద్దును గీయడానికి ఒక బాణాన్ని సంధించాడు. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ఆరాష్-ఎ-కమాంగిర్ అని పేరు పెట్టింది.


