ఉషా వాన్స్‌ క్రైస్తవ మతం స్వీకరించాలని నా కోరిక  | USA Vice President JD Vance clarifies amid row over wife conversion | Sakshi
Sakshi News home page

ఉషా వాన్స్‌ క్రైస్తవ మతం స్వీకరించాలని నా కోరిక 

Nov 1 2025 6:14 AM | Updated on Nov 1 2025 6:14 AM

USA Vice President JD Vance clarifies amid row over wife conversion

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ వెల్లడి  

వాషింగ్టన్‌:  అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ క్రైస్తవ మతస్థుడు. ఆయన భార్య ఉషా వాన్స్‌ హిందూ మతం ఆచరిస్తున్నారు. అయితే, తన భార్య ఉషా వాన్స్‌ క్రైస్తవ మతం స్వీకరించాలని తాను కోరుకుంటున్నట్లు జె.డి.వాన్స్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె క్రైస్తవురాలిగా మారాలన్నదే తన కోరిక అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ ఆఫ్‌ మిసిసిపీలో తాజాగా టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

తన భార్య ఉషా తనతోపాటు చర్చికి హాజరవుతోందని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒకరోజు ఆమె పూర్తిస్థాయిలో క్రైస్తవ మతం స్వీకరిస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను క్రైస్తవ నమ్ముతానని వెల్లడించారు. తన మతం, భార్య మతం వేర్వేరు అయినప్పటికీ తమ మధ్య ఎనాడూ ఎలాంటి విభేదాలు తలెత్తలేదని స్పష్టంచేశారు. ఆమె క్రైస్తవ మతంలోకి మారకపోయినా తనకు వచి్చన ఇబ్బందేమీ లేదన్నారు. 

ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు. మరోవైపు జె.డి.వాన్స్‌ తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హిందూ మత వ్యతిరేకి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. భార్యపై బలవంతంగా క్రైస్తవ మత విశ్వాసాలను రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఉషా వాన్స్‌ తెలుగు మూలాలున్న అమెరికన్‌ మహిళ. జె.డి.వాన్స్, ఉషా వాన్స్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు క్రైస్తవ మతం పాటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే జె.డి.వాన్స్, ఉషా వాన్స్‌ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement