పోప్‌ దుర్బలుడు | USA President Donald Trump attacked Pope Leo XIV | Sakshi
Sakshi News home page

పోప్‌ దుర్బలుడు

Apr 14 2026 4:37 AM | Updated on Apr 14 2026 6:32 AM

USA President Donald Trump attacked Pope Leo XIV

నా వల్లే ఆ పదవి: ట్రంప్‌ 

ఇంగితంతో ప్రవర్తిస్తే మంచిది 

లియో–14పై తీవ్ర విమర్శలు 

ఎవరికీ భయపడబోనన్న పోప్‌ 

పరస్పర విమర్శలతో దుమారం 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరికి పోప్‌ను కూడా వదలడం లేదు. ఇరాన్‌పై యుద్ధాన్ని తప్పుబడుతూ పోప్‌ లియో–14 చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లియో ఓ బలహీన పోప్‌ అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టడమే గాక మీడియాతో మాట్లాడుతూ కూడా పోప్‌పై పదునైన విమర్శలకు దిగారు. అసలు తనవల్లే ఆయనకు పోప్‌ పదవి దక్కిందని చెప్పుకొచ్చారు! ఈ విమర్శలపై పోప్‌ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్‌ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 ‘‘దైవ సందేశాన్ని ట్రంప్‌ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయన్నో, ఇంకెవరినో నేరుగా విమర్శించడం లేదు. ట్రంప్‌తో వాదనకూ దిగదలచుకోలేదు. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం ఎప్పుడూ వెనకాడబోను. ఒక్కటి మాత్రం నిజం. శాంతి స్థాపకులు మాత్రమే ఆశీర్వాదానికి పాత్రులు’’అన్నారు. వారి మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది! అమెరికా అధ్యక్షులకు, పోప్‌ స్థానంలో ఉన్నవారికి నడుమ అభిప్రాయ భేదాలు కొత్తేమీ కాకున్నా ఈ స్థాయి వాద ప్రతివాదాలు మాత్రం ఇదే తొలిసారి. 

ఇలాంటి పోప్‌ నాకొద్దు! 
పోప్‌గా లియో–14 సరిగా పని చేయడం లేదని ట్రంప్‌ ఆదివారం ట్రూత్‌ సోషల్‌ పోస్టులో ఆక్షేపించారు. ‘‘నేరాలపై స్పందించడంలో మరీ బలహీనుడు. ఇక ఆయన విదేశాంగ విధానమైతే మరీ దారుణం! ఇరాన్‌ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే, ఇలా అమెరికా అధ్యక్షుడినే విమర్శించే పోప్‌ నాకొద్దు! ఆయన మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారు. నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. లియో తీరు ఆయనకే గాక క్యాథలిక్‌ చర్చికి కూడా చాలా చేటు చేస్తోంది. 

ఆయన ఇప్పటికైనా రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం మాని గొప్ప పోప్‌గా రాణించడంపై దృష్టి పెడితే మంచిది! నేనైతే పోప్‌ లియోకు అస్సలు అభిమానిని కాను. నావల్లే ఆయనకు పోప్‌ పదవి దక్కింది. లియో పేరు తొలుత చర్చి పరిశీలనలో కూడా లేదు. నన్ను ఎదుర్కోవాలంటే ఆ పదవిలో ఒక అమెరికన్‌ ఉండాలనే భావనతోనే పోప్‌గా నియమించింది’’అంటూ తూర్పారబట్టారు. ఇరాన్‌పై ట్రంప్‌ యుద్ధాన్ని పోప్‌ తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ‘‘తాము సర్వశక్తిమంతులమని కొందరిలో నెలకొన్న భ్రమలే ఇరాన్‌పై యుద్ధానికి కారణం. కానీ యుద్ధాలకు దిగేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’అని గతంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ నాగరికతనే నాశనం చేస్తామన్న ట్రంప్‌ బెదిరింపులను కూడా తీవ్రంగా తప్పుబట్టారు.  


క్రీస్తు మాదిరిగా దివ్య శక్తులతో అమెరికాకు తాను హీలింగ్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఏఐ ఆధారిత ఫొటోను ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే దాన్ని డిలీట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement