
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చారు. ఈ అతి పెద్ద చర్య కారణంగానే భారత్, అమెరికా మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. భారత్‌పై సుంకాలను తగ్గిస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాకు భారత్ అతి పెద్ద చమురు వినియోగదారు. రెండు దేశాల మధ్య ఎంతో మిత్రుత్వం ఉంది. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్‌తో విభేదానికి మేము సిద్ధమయ్యాం. రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతోనే భారత్‌పై నేను భారత్‌పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్‌తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను. కేవలం ఇది మాకు మాత్రమే సమస్య కాదు. యూరప్‌కు సైతం ఇదే ప్రధాన సమస్యే’ అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పాత పాటే మళ్లీ పాడారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-పాక్ ఘర్షణ సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను తాను నివారించినట్టు ట్రంప్ తెలిపారు. కాంగో, రువాండా మధ్య గత 31ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తానే పరిష్కరించానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తాను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.