అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా అంటోంది. అయితే..
చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు.
శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.
2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..
అదే విషయమై.. అదే ట్రంప్ ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్ ఈస్ట్ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.
అమెరికా ఏం కోరుకుంటోంది
యురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.
బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.
లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.
దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.
ఇరాన్ ఏం ఆశిస్తోందంటే..
- ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్ అంటోంది.
- అణు శుద్ధి అవసరం కూడా. అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.
- తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.
- ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్ అంటోంది.
- దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.
- సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.
సాధ్యమైన సడలింపులు
ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.
వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.
మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.
సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.
ఒప్పందం కుదిరితే
- ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.
- ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.
- చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
- రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.
ఒప్పందం కుదరకుంటే
- ఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశం
- ఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.
- చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.
- ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.
- చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి.
రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్ ఈస్ట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.


