రెండు రోజుల్లో జరగొచ్చు: ట్రంప్
అమెరికాది బాధ్యతారాహిత్యం
హార్మూజ్ దిగ్బంధంపై చైనా
వాషింగ్టన్/బీజింగ్/బీరూట్: పశ్చిమాసియాలో యుద్ధానికి తెర దించే దిశగా అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవి బహుశా వచ్చే రెండు రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాదే వేదిక కానున్నట్టు వెల్లడించారు. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ కృషి వల్లే ఇది సాధ్యపడుతోదంటూ ట్రంప్ ప్రశంసించారు. ఆదివారం జరిగిన తొలి దఫా చర్చలు విఫలమవడం తెలిసిందే. ‘‘రెండో దఫా చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఆ దేశ ఓడరేవులన్నింటినీ అమెరికా దిగ్బంధించిన కారణంగానే దిగొచి్చంది’’ అని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధితో పాటు ఆ దేశ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 10 వేల మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్టు తెలిపింది. అయితే చమురు, రసాయనాలను తీసుకెళ్తున్న రిచ్ స్టారీ అనే నౌక మంగళవారం హార్మూజ్‌ను దాటినట్టు సమాచారం. హార్మూజ్ జలసంధిని తెరిపించే లక్ష్యంతో శుక్రవారం పారిస్‌లో జరిగే సదస్సుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించనున్నారు.
మరోవైపు హార్మూజ్‌ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. దాన్ని ప్రమాదకరమైన, బాధ్యతారహిత చర్యగా అభివరి్ణంచింది. అమెరికా, ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్‌కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది. తమపై టారిఫ్‌లు పెంచితే దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో అన్ని దేశాల సార్వబౌమత్వాన్నీ, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరముందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి.
ఇజ్రాయెల్, లెబనాన్ చర్చలు
ఇజ్రాయెల్, లెబనాన్ 33 ఏళ్ల అనంతరం తొలిసారి ప్రత్యక్ష చర్చలకు దిగాయి. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు మంగళవారం వాషింగ్టన్‌లో సన్నాహక చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ కూడా వాటిలో పాల్గొన్నారు. నెల రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తుండటం తెలిసిందే. వాటికి తెర దించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటి ఫలితాలకు కట్టుబడి ఉండబోనని లెబనాన్ సాయుధ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులకు దిగినట్టు హెజ్బొల్లా పేర్కొంది.


