సీజ్‌ఫైర్‌ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు | US Conducts Self Defence Strikes On Iranian Boats Missile Launch Sites | Sakshi
Sakshi News home page

సీజ్‌ఫైర్‌ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు

May 26 2026 7:13 AM | Updated on May 26 2026 8:40 AM

US Conducts Self Defence Strikes On Iranian Boats Missile Launch Sites

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. 

అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్‌ అబ్బాస్‌ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్‌లో సీమైన్స్‌ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్‌తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.

అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్‌సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్‌ఫైర్‌ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.

అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

ఇటు లెబనాన్‌లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.

ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన  నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement