పిరికిపందలం కాదు! నాలోనూ ఈ గడ్డ రక్తమే..: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భార్య భావోద్వేగం

Ukraine Russia War: Olena Zelenska Ukraine First Lady Emotional Posts - Sakshi

ప్రియమైన ఉక్రెయిన్‌ ప్రజలారా. ఇది యుద్ధ సమయం. ఈ కష్టకాలంలో నా భర్త పక్కన కూడా నేనుండాలి. కానీ, అది వీలుపడడం లేదు. ఎందుకంటే..  నా పిల్లలు నా వైపే చూస్తున్నారు.  నా అవసరం వీళ్లకు ఎంతో ఉంది. అయినా నా కళ్లు ఇప్పుడు మిమ్మల్నే గమనిస్తున్నాయి. మీ భద్రత గురించే నా ఆందోళనంతా. ప్రతిక్షణం టీవీల్లో, వీధుల్లో, ఇంటర్నెట్‌లో మీరు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.  మీలాంటి ప్రజలతో కలిసి ఈ గడ్డపై కలిసి బతుకుతున్నందుకు గర్వంగా ఉంది. నాకిప్పుడు కన్నీళ్లు రావడం లేదు.  ధృడంగా ఉన్నా.  లవ్‌ యూ ఉక్రెయిన్‌.. ఉక్రెయిన్‌ ఫస్ట్‌ లేడీ  ఒలెనా జెలెన్ స్కా

ఒకవైపు ప్రత్యర్థి సైన్యం విరుచుకుపడుతోంది. మరోవైపు మిత్రదేశాలు ఆశ్రయం ఇచ్చేందుకు చేతులు చాచాయి. అయినా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ శత్రువులకు వెన్నుచూపించడం లేదు. ఇది మూర్ఖత్వమో.. వీర పోరాటమో అని అనుకున్నప్పటికీ ఉక్రెయిన్‌ పౌరులు, సోషల్‌ మీడియాలో కొందరు యూజర్లు జెలెన్‌స్కీకి మద్దతు ప్రకటిస్తూ ‘శెభాష్‌’ అంటున్నారు. ఏదైనా తన దేశం తర్వాతే అంటూ సైనికుల్లో భర్త స్ఫూర్తిని రగిలిస్తుంటే..  భర్తను వెన్నుతట్టి ముందుకు సాగనంపడంతోనే సరిపెట్టకుండా సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లో మనోధైర్యం నింపుతోంది జెలెన్‌స్కీ భార్య, ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా. 

టార్గెట్‌.. అయినా కూడా
జెలెన్‌స్కా Olena Volodymyrivna Zelenska ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె దేశం విడిచి పారిపోయిందా? రష్యా మీడియా లేవనెత్తిన ఈ అనుమానాన్ని తన స్టేట్‌మెంట్‌తో పటాపంచల్‌ చేసింది ఆమె.  దేశం విడిచి పారిపోలేదని, ఉక్రెయిన్ లోనే ఉండి పోరాడుతున్నామని జెలెన్ స్కా గర్వంగా ప్రకటించుకుంది. నాలోనూ ఇక్కడి రక్తమే ప్రవహిస్తోంది. పిరికిపందలం కాదు. నా కన్నబిడ్డల కోసమే నా ఈ అజ్ఞాతం. అంటూ ప్రకటించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఇద్దరు పిల్లలు. పైగా రష్యా బలగాల మొదటి లక్క్ష్యం జెలెన్‌స్కీ కాగా, ఆపై ఆయన కుటుంబాన్ని లక్క్ష్యంగా చేసుకునే అవకాశాలూ ఉన్నాయి.  ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ.. ఉక్రెయిన్ ను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అంటూ దేశం విడిచిపోకుండా, భర్తకు తోడుగా అక్కడే ఓ రహస్య బంకర్‌లో ఉండిపోయింది ఆమె.

ఒకే ఊరిలో.. ఒకే బడిలో..
44 ఏళ్ల ఒలెనా జెలెన్ స్కా ఆర్కిటెక్చర్‌ ఎక్స్‌పర్ట్‌. మంచి రచయిత. జెలెన్‌స్కా, జెలెన్‌స్కీ.. ఇద్దరూ పుట్టింది ఒకే ఊరిలో(Kryvyi Rih).. ఒకే సంవత్సరంలో.  చిత్రం ఏంటంటే.. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు కూడా.  అయితే కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆపై ప్రేమ.. 2003లో పెళ్లితో ఒక్కటయ్యారు.  జెలెన్‌స్కీ పొలిటికల్‌ స్ఫూఫ్‌ వీడియోలు చేయడంలో సహకరించింది ఈమె రాతలే.   ఓ దశలో నటుడిగా కెరీర్ మంచి దశలో ఉండగా, జెలెన్ స్కీ రాజకీయాలవైపు అడుగులేశారు. ఈ నిర్ణయం ఆమెకు ఇష్టం లేకున్నా..  భర్త నిర్ణయాన్ని కొన్నాళ్లకు గౌరవించారు. మొదటి నుంచి ప్రతి విషయంలో.. ఆఖరికి యుద్ధం వేళ కూడా ఆమె భర్తను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు ఉక్రెయిన్ ప్రజలను, సోషల్‌ మీడియాను ఆకట్టుకుంటోంది. 

స్టూడియో క్వార్టర్‌ 95 పేరుతో నిర్మాణ సంస్థను నడుపుతున్న జెలెన్‌స్కా..  జెండర్‌ఈక్వాలిటీ, చైల్డ్‌హుడ్‌ న్యూట్రీషియన్‌ కోసం కృషి చేస్తోంది. 2019 డిసెంబర్‌లో ఉక్రెయిన్‌ వుమెన్స్‌ కాంగ్రెస్‌లో ఆమె ఇచ్చిన ప్రసంగం.. అంతర్జాతీయంగా పలువురిలో స్ఫూర్తిని రగిల్చింది. ఇప్పుడు ఆమె పోస్టులు కూడా ఉక్రెయిన్‌లకు మనోధైర్యం పంచుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top