
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.
యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.
( @realDonaldTrump - Truth Social Post )
( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )
I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025

ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.