
ప్రపంచ దేశాల అప్పు 102 ట్రిలియన్ డాలర్లు
సగం వాటాతో అగ్రస్థానంలో అమెరికా, చైనా
3.2 ట్రిలియన్ డాలర్లతో టాప్–10లో భారత్
అప్పుల ఊబిలోకి అభివృద్ధి చెందుతున్న దేశాలు
అనుకుంటాంగానీ.. అప్పులేనిదే అమెరికాకూ గడవదు. ప్రపంచంలోసంపన్నదేశం, అగ్రరాజ్యం అని చెప్పుకొనే అమెరికానే.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పు చేసిన దేశం కావడం విశేషం. ఐక్యరాజ్యసమితివాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పులప్రపంచం 2025’ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా 102 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనాలదే. 2010 నుంచి చూస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతోంది. దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపెడవుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికా. దాని అప్పు 35 ట్రిలియన్ డాలర్లు. ఆ తరువాతి స్థానంలో చైనా ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. మొత్తం ప్రపంచ అప్పులో సుమారు 70 శాతం అభివృద్ధి చెందిన దేశాలదే అయితే అందులో అమెరికా, చైనాలదే సగభాగం. ఆ తరువాత సుమారు 25 శాతం ఆసియా, ఓషనియా దేశాలది.
అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో 31 శాతం. ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పుల ప్రపంచం 2025’ నివేదికలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది.
వడ్డీల భారం తడిసిమోపెడు
అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024లో రికార్డు స్థాయిలో 921 బిలియన్ డాలర్లు కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి. 2017తో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2023తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 61 దేశాలు.. ప్రభుత్వ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ కేవలం తీసుకున్న రుణానికి వడ్డీకింద చెల్లిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు విరివిగా ఖర్చు చేయాలి.
కానీ, వడ్డీల భారం అందుకు అవకాశం ఇవ్వడం లేదు. 2011–13 నుంచి 2021–23 మధ్య విద్య కోసం ఈ దేశాలు చేసిన వ్యయం 52 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు 77 శాతం పెరిగింది. కానీ, తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఏకంగా 84 శాతం ఎగబాకింది. ఇలా విద్య, ఆరోగ్యం కంటే వడ్డీలకే ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల్లో నివసిస్తున్న జనాభా దాదాపు 340 కోట్లు.
జీడీపీలో 60 శాతం!
అభివృద్ధి చెందుతున్న సుమారు 60 దేశాల్లో.. జీడీపీలో అప్పు వాటా ఏకంగా 60 శాతానికి చేరిపోయింది. 2020లో ఆఫ్రికా, ఆసియా, ఓషనియా, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఇలాంటి దేశాల సంఖ్య 67 కాగా.. తరువాత స్వల్పంగా తగ్గుతూ 2024 నాటికి 58కి చేరింది. 2010లో ఈ సంఖ్య 35. 2013తో పోలిస్తే ప్రైవేటు సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకుపైగానే పెరిగింది. ఆఫ్రికా దేశాల్లో ఇది 42 శాతం, ఆసియాలో 61, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఏకంగా 71 శాతం.
8.6 శాతం అప్పుల కోసమే..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగానికిపైగా దేశాల మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయంలో.. ఆయా దేశాల బహిరంగ రుణం విలువ దాదాపు 88 శాతం. అంటే.. దాదాపుగా వస్తు, సేవల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమంత అప్పు అన్నమాట! ఈ దేశాలు తమ మొత్తం ఆదాయంలో 8.6 శాతాన్ని అప్పు కోసమే (అసలు, వడ్డీ ) కేటాయిస్తున్నాయి. 2010తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. దీనివల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు, మూలధన వ్యయానికి సరిపడా నిధులు ఉండటం లేదు.
వడ్డీ కూడా ఎక్కువే
అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. మరి ఈ దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే.. వస్తోంది. కానీ.. రాయితీ రుణాల రూపంలో! గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్తా ఇప్పుడు మారిపోయింది. 2011–13 మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో 28 శాతంగా ఉన్న ఈ రుణం 2021–23 మధ్య 33 శాతానికి పెరిగింది.