సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్‌ | Donald Trump Warns Iran, Nuclear Deal Talks Near Final Stage, Says US Ready For Any Outcome | Sakshi
Sakshi News home page

సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్‌

May 21 2026 8:32 AM | Updated on May 21 2026 9:59 AM

Trump Says US can wait a few days for right answers from Iran

వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్‌తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని బాంబు పేల్చారు. ఇరాన్‌ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్‌, అమెరికా మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మాకు సరైన సమాధానాలు రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా చేయిదాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ నుంచి మాకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారు. ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉంది. ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది’ అని అన్నారు.

ఇదే సమయంలో ఇరాన్‌కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్‌ తేల్చి చెప్పారు. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుందా? లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందా? అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు.

ఒప్పందం కుదరకపోతే భారీ దాడి..
అంతకుముందు.. ఇరాన్‌పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. గల్ఫ్​ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్‌తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement